ఏపీ రాజకీయపంచాయతీలు హైదరాబాద్‌లో ఎందుకు? కేటీఆర్‌

September 26, 2023


img

చంద్రబాబు నాయుడు అరెస్టుని నిరసిస్తూ హైదరాబాద్‌లో ఐ‌టి ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుండటంతో పోలీసులు అడ్డుకొంటున్నారు. శాంతియుతంగా చేస్తున్నా అటువంటి ఆందోళనలను అనుమతించబోమని స్పష్టం చేశారు. 

ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, “ఇది ఏపీలో రెండు రాజకీయ పార్టీల మద్య జరుగుతున్న పంచాయితీ. దాంతో మా పార్టీకి, ప్రభుత్వానికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం కోర్టులలో ఉండగా ఇక్కడ హైదరాబాద్‌లో ఆందోళనలు చేయడం సరికాదు. అయినా ఏపీలో రాజకీయ పంచాయితీలను ఏపీలోనే తేల్చుకోవాలి కానీ వాటి సమస్యను ఇక్కడ మా పార్టీ, మా ప్రభుత్వం మెడకు చూడతామంటే సహించబోము. 

నాకు నారా లోకేశ్‌, జగన్‌, పవన్‌ కళ్యాణ్‌ అందరూ దోస్తులే. వారెవరితో నాకు ఎటువంటి సమస్యలు లేవు. కానీ ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాను. నారా లోకేశ్‌ నాకు ఫోన్ చేసి హైదరాబాద్‌లో ఐ‌టి ఉద్యోగులను శాంతియుతంగా ఆందోళనలు చేయడానికి ఎందుకు అనుమతించడంలేదని అడిగారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఏ ఆందోళనలను అనుమతించలేమని చెప్పాను. తెలంగాణ ఉద్యమాల సమయంలో కూడా ఐ‌టి కారిడార్‌లో ఎటువంటి ఆందోళనలు జరుగలేదు. కానీ ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో రాజకీయ సమస్య కోసం ఆందోళన చేస్తామంటే అంగీకరించాలా?

ఏపీలో ఆ రెండు పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరు పట్ల మాకు ఎటువంటి ఆసక్తి లేదు. ఒకవేళ మా పార్టీలో ఎవరైనా స్పందించినా అది వ్యక్తిగతమే తప్ప దాంతో మా పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదని స్పష్టం చేస్తున్నాను,” అని నిష్కర్షగా చెప్పవలసినది చెప్పేశారు.


Related Post