గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ ప్రభుత్వం మద్య కనబడిన సయోధ్య మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. దాసోజు శ్రావణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు నామినేట్ చేయాలంటూ మంత్రివర్గం చేసిన సిఫార్సును గవర్నర్ తమిళిసై తిరస్కరించడంతో మళ్ళీ బిఆర్ఎస్ నేతలు ఆమెపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మా ప్రభుత్వం బీసీలకు పదవులు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే, బీజేపీ గవర్నర్ ద్వారా అడ్డుకొంటోంది. ఆమె తన నిర్ణయాన్ని కప్పిపుచ్చుకొనేందుకు కుంటిసాకులు చెపుతున్నారు. గవర్నర్ వ్యవస్థని అడ్డంపెట్టుకొని రాష్ట్రాలలో భారత రాజ్యాంగానికి బదులు బీజేపీ సొంత రాజ్యాంగాన్ని అమలుచేస్తోంది. ఇది ఫెడరల్ స్పూర్తికి విరుద్దం.
బీజేపీ ఎప్పుడూ బీసీ వ్యతిరేకిగానే ఉంది. ఇప్పుడు దీంతో మరోసారి నిరూపించుకొంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులను ఆమోదించడం సాంప్రదాయం. కానీ తెలంగాణ గవర్నర్ ఆ సాంప్రదాయాన్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జివి హోదాలో ఉన్న ఆమె ఈవిదంగా వ్యవహరించడం చాలా బాధాకరం. ఆమె తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు,” అని అన్నారు.