హైదరాబాద్, పాతబస్తీకే పరిమితమైన మజ్లీస్ పార్టీ తెలంగాణలో ఇతర నియోజకవర్గాలలో పోటీ చేయదనే విషయం అందరికీ తెలిసిందే. బిఆర్ఎస్‌తో మజ్లీస్ పొత్తులే అందుకు కారణమని వేరే చెప్పక్కరలేదు. ఈ పొత్తు మజ్లీస్ పార్టీని రాష్ట్రంలో విస్తరించి బలపదనీయకుండా చేస్తోందని తెలిసి ఉన్నప్పటికీ ఆ పార్టీ అధినేత ఓవైసీ ఏవిదంగా అంగీకరించిందో, సర్దుకుపోతోందో మజ్లీస్ నేతలకే తెలియాలి.
అయితే తెలంగాణలో ఇతర జిల్లాలకు, నియోజకవర్గాలకు విస్తరించే అవకాశం ఉన్నప్పటికీ అటువంటి ఆలోచన చేయని మజ్లీస్ పార్టీ ఇతర రాష్ట్రాలలో తనకు బలం ఉన్నచోట పోటీ చేస్తూ ఆయా రాష్ట్రాలలో విస్తరించేందుకు ప్రయత్నిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
తాజాగా మజ్లీస్ పార్టీ పొరుగునే ఉన్న ఆంధ్రాకు విస్తరించాలని నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, నిన్న ఏపీలోని మజ్లీస్ మద్దతుదారులతో సమావేశమైనప్పుడు, ఈ విషయం స్వయంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో మజ్లీస్ పార్టీ ఏపీలో పోటీ చేస్తుందని చెప్పారు. కానీ అంతకంటే ముందు ఏపీలో మజ్లీస్ పార్టీని బలోపేతం చేసేందుకు మీరే గట్టిగా కృషి చేయాలని ఓవైసీ వారికి సూచించారు.
చంద్రబాబు నాయుడు అరెస్టుపై కూడా స్పందిస్తూ, “ప్రస్తుతం చంద్రుడు జైల్లో ఉన్నాడు. ఎందుకో అందరికీ తెలుసు. ఏపీ ప్రజలకు ఆ చంద్రుడు, జగన్ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. వారిద్దరిలో చంద్రబాబు నాయుడుని నమ్మలేము. జగన్ చాలా నయం,” అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.