ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంటులో ఆమోదింపజేసుకొన్నప్పుడు, దానిని 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత జనగణన జరిపి లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలను పునర్విభజించిన (డీలిమిటేషన్) తర్వాత అమలుచేస్తామని ప్రకటించింది.
డీలిమిటేషన్‌పై మంత్రి కేటీఆర్ నిశితంగా స్పందించారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో అత్యధిక శాతం ప్రజలు కుటుంబ నియంత్రణ పాటిస్తుంటారని, ఆ కారణంగా దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తగ్గగా, ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా బారీగా పెరిగిందన్నారు.
కనుక జనభా ప్రాతిపదికన ఉత్తరాది రాష్ట్రాలకు మరిన్ని లోక్‌సభ సీట్లు లభించబోతుండగా, దక్షిణాది రాష్ట్రాలకు మాత్రం తగ్గే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అప్పుడు పార్లమెంటులో ఉత్తరాది రాష్ట్రాల ఎంపీలు మరింత మంది పెరుగుతారు. కానీ అదే నిష్పత్తిలో దక్షిణాది రాష్ట్రాల ఎంపీల సంఖ్య పెరగదు. కనుక పార్లమెంటులో ఉత్తరాది పెత్తనం పెరిగి దక్షిణాది రాష్ట్రాల గొంతు వినబడకుండా పోతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
కనుక డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు తప్పవని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తన వాదనలకు మద్దతుగా డీలిమిటేషన్‌పై ఓ జాతీయ చానల్ వేసిన అంచనాలను కేటీఆర్ కూడా జోడిస్తూ ట్వీట్ చేశారు.