చంద్రబాబు నాయుడు... ఇంకా జైల్లోనే!

September 22, 2023


img

మాజీ సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఈ నెల 9న ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్‌ విధించింది. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉంటున్నారు. నేటికీ 13 రోజులైంది. కానీ ఇంతవరకు ఆయనకు బెయిల్, జైలు నుంచి విముక్తి లభించలేదు. 

ఏపీ సీఐడీ పోలీసులు తనపై నిరాధారమైన స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు వేసి అన్యాయంగా తనను జైల్లో వేశారని కనుక ఆ కేసుని కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు నాయుడు వేసిన క్వాష్ పిటిషన్‌ను కూడా ఏపీ హైకోర్టు కొట్టివేసింది. 

తన తరపున వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుద్రాని తెచ్చుకొని చంద్రబాబు నాయుడు న్యాయపోరాటం చేస్తున్నా వరుసగా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి తప్ప ఎక్కడా ఉపశమనం లభించడం లేదు.

మరోపక్క ఏపీ సీఐడీ పోలీసులు ఆయనపై వరుసపెట్టి కొత్త కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. వాటిలో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు దరఖాస్తు చేసుకొంటూనే ఉన్నారు. 

హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టివేయడంతో ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను కస్టడీలో తీసుకొని విచారించడానికి సిద్దంగా ఉన్నారు. కస్టడీలో విచారణ అంటే ఏవిదంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కనుక చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. 

గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన కుమారుడు నారా లోకేశ్‌ మంత్రిగా చేశారు. ఆయన కూడా ‘ఏపీ ఫైబర్ గ్రిడ్‌’ ఏర్పాటులో అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ మరో కేసు వేసింది. తనను కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపుతారని ముందే పసిగట్టిన నారా లోకేశ్‌, ఢిల్లీ వెళ్ళి అక్కడే ఉండిపోయారు. ఆయన ఏపీకి తిరిగి వస్తే అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ పోలీసులు కాసుక్కూర్చొన్నారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తామని కేసీఆర్‌ చెప్పినప్పటికీ, వెంకయ్య నాయుడు రాయబారంతో వెనక్కు తగ్గారు. కానీ ఏపీ సిఎం జగన్‌ మాత్రం చంద్రబాబు విషయంలో ‘తగ్గేదేలే’ అంటున్నారు. ఆయనను జైలులో నుంచి బయటకు రాకుండా చేస్తూ ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఓ వెలుగు వెలిగి ఐ‌టి కంపెనీలను రప్పించి ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు నాయుడుకి ఈ వయసులో జైలుకి వెళ్లవలసి రావడం బాధాకరమే.


Related Post