పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్, బీజేపీలు ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి వెంటపడ్డాయి. చివరికి ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఆయన కాంగ్రెస్‌లో చేరక ముందే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలలో ఆరేడు స్థానాలలో తన అభ్యర్ధులను ప్రకటించి వారిని గెలిపించుకొంటానని శపధం చేశారు.
బహుశః ఆయన ఈ విషయం తనను పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చిన రేవంత్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలకు చెప్పే ఉంటారు. ఆ తర్వాతే ఆయన కాంగ్రెస్‌లో చేరారు కనుక ఆయన షరతుకి వారు అంగీకరించే ఉండాలి. లేదా ఆయన అడిగిన స్థానాలకు కనీసం హామీ అయినా ఇచ్చి ఉండాలి.
తాజా సమాచారం ప్రకారం ఆయన ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, వనపర్తి నియోజకవర్గాలలో తన అనుచరులకు టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ ఆయన అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే ఏం చేస్తారో చూడాల్సిందే.
పొంగులేటి అడుగుతున్న పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయాలనుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన తర్వాతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన నివాసానికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించారు. కనుక పాలేరు టికెట్ వారిద్దరిలో ఎవరికి లభిస్తుందో?