పాపం షర్మిల... ఏం చేస్తారో ఇప్పుడు?

September 21, 2023


img

వైఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. గత రెండేళ్ళుగా ఆమె కాళ్ళు అరిగిపోయేలా తెలంగాణలో ఎంత పాదయాత్ర చేసినప్పటికీ ప్రజలు, మీడియా కూడా పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. సరిగ్గా ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు రావడంతో చాలా సంతోషంగా దానిలో తన పార్టీని విలీనం చేసేందుకు సిద్దమైపోయారు.

కానీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఆమెకు చోటు, అవసరం రెండూ లేవు కావాలంటే వెళ్ళి ఏపీ కాంగ్రెస్‌లో చేరమని రేవంత్‌ రెడ్డితో సహా కొందరు సీనియర్లు చెప్పారు. అయినప్పటికీ ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీతో మాట్లాడి ఈ మ్యాటర్ సెటిల్ చేసుకువచ్చారు. కనుక ఇటీవల కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశాలకు సోనియా గాంధీ వచ్చినప్పుడు కాంగ్రెస్‌ కండువా కప్పుకొనేందుకు సిద్దమయ్యారు. తుమ్మల నాగేశ్వర రావు తదితరులు చేరాకు కానీ ఆమె చేరలేదు. 

ఆమెను తెలంగాణ కాంగ్రెస్‌లో చేర్చుకొంటే ఆమె ఆంద్రా మూలాల కారణంగా మళ్ళీ ఓటమి తప్పదని, కనుక ఎన్నికల తర్వాత చేర్చుకోమని రేవంత్‌ రెడ్డి, రేణుకా చౌదరి, వి హనుమంతరావు వంటివారు గట్టిగా చెప్పడంతో కాంగ్రెస్‌ అధిష్టానం వెనకడుగు వేసిన్నట్లు సమాచారం. 

దీంతో వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్‌ ఆగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు ఆమె తన సొంత పార్టీతో బరిలో దిగుదామంటే వెనక నేతలు, కార్యకర్తలు లేరు. ప్రజలు కూడా ఆమెను నమ్మరు. అలాగని వెళ్ళి ఏపీ కాంగ్రెస్‌లో చేరి జగనన్నతో యుద్ధం చేయలేరు. కనుక ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానం చెప్పేవరకు ఎదురుచూడాల్సిందే. పాపం షర్మిల!


Related Post