మహిళా రిజర్వేషన్ బిల్లుని నిన్న లోక్‌సభ ఆమోదించింది. అయితే దీనిపై ఓటింగ్ జరిగినప్పుడు 454 మంది సభ్యులలో అసదుద్దీన్ ఓవైసీ, మహారాష్ట్రకు చెందిన సయ్యద్ ఇంతియాజ్ జలీల్ ఇద్దరు ఎంపీలు మాత్రమే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు.
దీనిపై నిన్న సభలో జరిగిన చర్చలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ,”ఈ బిల్లులో ఓబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడం వలన వారికి అన్యాయం జరుగుతుంది. దీంతో అగ్రవర్ణ మహిళలకు మాత్రమే మేలు కలుగుతుంది.
దేశ జనాభాలో ముస్లిం మహిళలు 7 శాతం ఉన్నప్పుడు వారికి దీనిలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించకపోవడం అన్యాయం. చట్టసభలలో మహిళలకు అవకాశం కల్పిస్తున్నామని గొప్పగా చెప్పుకొంటున్నారే కానీ మైనార్టీ మహిళలకు అవకాశం లేకుండా చేస్తున్నారు. అందుకే మేము ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాము,” అని అన్నారు.
ఈ బిల్లులో మహిళలకు లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభ, మండలిలో 33 శాతం సీట్లు తప్పనిసరిగా కేటాయించాలని చెపుతోంది. వాటిలో మైనార్టీ మహిళలతో సహా అన్ని వర్గాల మహిళలకు కేటాయించుకొనే స్వేచ్చ మజ్లీస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది.
ఈ బిల్లుతో మైనార్టీ మహిళలకు అన్యాయం జరుగుతుందని వాదిస్తున్న మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, తన పార్టీలో పురుషులకే అన్ని టికెట్స్ కేటాయిస్తుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. ముస్లిం మహిళలకు భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘త్రిపుల్ తలాక్’ బిల్లుని కూడా ఆయన వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. స్వయంగా ఆచరించని న్యాయం, ధర్మం గురించి అసదుద్దీన్ ఓవైసీ వంటివారు పార్లమెంటులో మాట్లాడుతుండటం చాలా విడ్డూరంగా ఉంది.