మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా చట్ట రూపం దాల్చలేదు కానీ దాని క్రెడిట్ కోసం అప్పుడే అన్ని పార్టీలు కీచులాడుకొంటున్నాయి. తమ ప్రభుత్వం పోరాటాల వలననే ఇది సాధ్యపడిందని కల్వకుంట్ల కవితతో సహా బిఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పుకొంటుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్ధాలుగా చేయలేకపోయిన పనిని మోడీ పూర్తిచేసి మహిళలకు రాజ్యాధికారంలో భాగం కల్పిస్తున్నారని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకొంటున్నారు.
మోడీ ప్రభుత్వానికి దీనిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణం అమలు చేయాలి కానీ మరో 5 ఏళ్ళ తర్వాత జరిగే ఎన్నికలలో అమలుచేస్తామని ప్రజలను, ముఖ్యంగా మహిళలను ఓట్ల కోసం మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.
ఈవిదంగా ఎవరి వాదనలు వారు వినిపిస్తూ ఈ అంశం నుంచి రాజకీయంగా మైలేజి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రి కేటీఆర్ కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, దీని వలన మహిళలకు మేలు కలుగుతుంది కనుక తాను సీటు కోల్పోయినా బాధపడనని అన్నారు.
వైఎస్ షర్మిల వెంటనే స్పందిస్తూ, “అప్పటివరకు ఎదురు చూడటం ఎందుకు కేటీఆర్ గారు? చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడే మీ సీటును త్యాగం చేసి మహిళా అభ్యర్ధికి ఇవ్వొచ్చు కదా?ఈ ఎన్నికలలోనే మీ పార్టీ 39 మంది మహిళలకు టికెట్లు ఇస్తే ఎవరైనా అభ్యంతరం చెప్తారా? కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే తప్ప మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వకూడదని రూల్ ఏమైనా ఉందా?లేదు కదా? మరి ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవచ్చు కదా?” అని సూటిగా ప్రశ్నించారు.