తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నీళ్ళు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు’ అనేది బిఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ సృష్టించిన ట్యాగ్ లైన్ మాత్రమే. కనుక ఆ దిక్కుమాలిన ట్యాగ్ లైన్ బిఆర్ఎస్ పార్టీదే తప్ప దాంతో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఎటువంటి సంబందమూ లేదు.
తెలంగాణ ప్రజలు కోరుకొన్నది స్వేచ్చా, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి. సమైక్య రాష్ట్రంలో మాపై ఆంధ్రావాళ్ళ పెత్తనం ఏమిటని పోరాడారు. తమకు సామాజిక న్యాయం జరగడం లేదని పోరాడారు. సమైక్య రాష్ట్రంలో సంక్షేమ పధకాలు అమలుకాలేదా?పింఛన్, ఇళ్ళు, ఉచిత కరెంట్ రాలేదా? ఉమ్మడి రాష్ట్రంలో ఏమి రాలేదు?” అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే పోరాడి తెలంగాణ సాధించుకొన్నామని ఇంతకాలం ప్రజలు కూడా నమ్ముతున్నారు. కానీ అది బిఆర్ఎస్ పార్టీ ట్యాగ్ లైన్ అని, దానినే అది ప్రజల మనసులలో బలంగా నాటుకుపోయేలా చేసిందని రేవంత్ రెడ్డి అభిప్రాయంగా కనిపిస్తోంది. అయితే గతంలో ఆయన కూడా పలు సందర్భాలలో ‘నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ సాధించుకొన్నామని’ అన్నారు. కానీ ఇప్పుడు కాదంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రాన్ని పదేళ్ళపాటు పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు ఏమీ చేయలేదని,ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములను కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా అమలు చేయలేదని బిఆర్ఎస్ నేతలు గట్టిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే.
వాటిని తిప్పి కొట్టేందుకే బహుశః రేవంత్ రెడ్డి ఈ సరికొత్త వాదన చేస్తున్నట్లు అర్దమవుతోంది. అయితే ఈ ప్రయత్నంలో సమైక్య రాష్ట్రంలో అంతా దివ్యంగా ఉండేదనే ఒక్క మాటతో రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి స్వయంగా ఆయుధం అందించిన్నట్లయింది. కనుక కాంగ్రెస్ ముసుగులో ఆంధ్రా పాలకులు మళ్ళీ తెలంగాణను దోచుకొనేందుకు వస్తున్నారని బిఆర్ఎస్ ఎదురుదాడి ప్రారంభించడం ఖాయమే.