తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు ప్రధానపార్టీలు తమ వాదనలతో ప్రజలను గందరగోళ పరుస్తుంటాయి. ప్రతీ ఎన్నికలలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, కేసీఆర్ తమను ఎదుర్కొలేక కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి లేపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ నేతలు వాదిస్తుంటారు.
కాంగ్రెస్, బీజేపీలు నాణేనికి బొమ్మ బొరుసు వంటివని, ఆ రెండు జాతీయపార్టీలు దేశంలోని ఏ ప్రాంతీయపార్టీని బ్రతకనీయవని అందుకు అవి పరస్పరం సహకరించుకొంటాయని బిఆర్ఎస్ నేతలు వాదిస్తుంటారు.
మూడు పార్టీల నేతలు తమ బలమైన వాదనలకు నిరూపించుకొనేందుకు కొన్ని బలమైన నిదర్శనాలు కూడా చూపుతూ ప్రజలను అయోమయ పరుస్తుంటాయి.
ఇప్పుడూ అదే జరుగుతోంది. ఇటీవల తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ సభకు కేసీఆరే నిధులు సమకూర్చారని లేకుంటే రాష్ట్ర కాంగ్రెస్ నేతలెవరికీ అంత ఖర్చు చేసే స్థోమత లేదని బీజేపీ నేతలు వాదించారు. అత్యంత శక్తివంతుడైన మోడీని శత్రువుగా ఉంచుకోవడం కంటే రాహుల్ గాంధీని శత్రువుగా ఉంచుకోవడమే మంచిదని కేసీఆర్ భావిస్తున్నారని బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
బీజేపీ, బిఆర్ఎస్ మద్య రహస్య అవగాహన ఉంది కనుకనే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియాను అరెస్ట్ చేశారు కానీ కల్వకుంట్ల కవితని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ నేత మధూయాష్కీ గౌడ్ నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీజేపీలు రెండూ దేశానికి పట్టిన చీడ అని వాటిని వదిలించుకొంటే కానీ దేశం బాగుపడదని కేసీఆర్ పలుమార్లు అన్న సంగతి తెలిసిందే. మూడు పార్టీల వాదనలతో ప్రజలు అయోమయానికి గురించేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కనుక ప్రజలే విజ్ఞతతో ఆలోచించి రాష్ట్రానికి తగిన పార్టీని ఎన్నుకోవలసి ఉంటుంది.