మహిళా రిజర్వేషన్ బిల్లు.... మొదటి దెబ్బ బిఆర్ఎస్‌ పార్టీకే?

September 19, 2023


img

ఎన్నో దశాబ్ధాలుగా పక్కన పడేసిన ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుకి ఆమోదముద్ర వేసిన్నట్లు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ ట్వీట్ చేశారు. కనుక ఈ బిల్లును నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. 

దీనికి దేశంలో అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి కనుక పార్లమెంట్‌ ఆమోదం లాంఛనప్రాయమే. ఒకవేళ ఏ పార్టీ అయినా దీనిని వ్యతిరేకించిన్నట్లయితే ఆ రాష్ట్రంలో దాని రాజకీయ ప్రత్యర్ధులకు అస్త్రంగా మారుతుంది కనుక  ఎవరూ దీనిని వ్యతిరేకించలేరు. 

ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే, లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలలో తప్పనిసరిగా 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించవలసి ఉంటుంది. అయితే దీని కోసం పోరాడుతున్న బిఎస్ పార్టీయే ముందుగా చాలా ప్రభావితం కాబోతోంది. 

సిఎం కేసీఆర్‌ ఇప్పటికే 115 మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిలో కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆ జాబితాను పక్కన పెట్టి మళ్ళీ కొత్త జాబితా ప్రకటించవలసి ఉంటుంది! 

దానిలో 39 మంది మహిళా అభ్యర్ధులకు టికెట్స్ కేటాయించవలసి ఉంటుంది. దీంతో ఇప్పటికే టికెట్స్ పొంది ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించిన బిఆర్ఎస్‌ అభ్యర్ధులు తీవ్రంగా నష్టపోనున్నారు. కనుక వారితో పాటు టికెట్స్ ఆశిస్తున్న మహిళా అభ్యర్ధులు కూడా సిఎం కేసీఆర్‌ మీద ఒత్తిడి చేయడం ఖాయం. అంతే కాదు... మహిళా రిజర్వేషన్ బిల్లు తెలంగాణతో సహా దేశంలో అన్ని పార్టీల బలాబలాలను తారుమారు చేయబోతోంది. ఈ బిల్లు కోసం పోరాటాలు చేసిన బిఆర్ఎస్‌ పార్టీతో సహా అన్నీ పార్టీలు తమ గోతిని తామే తవ్వుకొన్నట్లయిందని చెప్పవచ్చు.


Related Post