బిఆర్ఎస్ పార్టీ నుంచి తుమ్మల నాగేశ్వరరావు బయటకు వచ్చాక కాంగ్రెస్ పార్టీలో జేరేందుకు సిద్దమయ్యారు. ఆయన ఖమ్మం జిల్లా పాలేరు నుంచి శాసనసభకు పోటీ చేయాలనుకొంటున్నారు. కానీ ఈలోగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమవుతుండటంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. ఆమె కూడా పాలేరు నుంచి పోటీ చేయాలనుకొంటుండటమే తుమ్మల వెనకడుగు వేయడానికి కారణమని తెలుస్తోంది.
అయితే ఇవాళ్ళ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు. పాలేరు సీటు ఆయనకే ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఒప్పించి మళ్ళీ హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు.
రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగనున్నాయి. వీటిలో పాల్గొనేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తదితర హేమాహేమీలు అందరూ హైదరాబాద్ వస్తున్నారు. ఎల్లుండి సాయంత్రం హైదరాబాద్ శివారులో తుక్కుగూడ వద్ద కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరుగనుంది. ఆ సాభలో తుమ్మల నాగేశ్వరరావు సోనియా, రాహుల్, కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
తుమ్మలకు పాలేరు సీటు కేటాయిస్తే, మరి వైఎస్ షర్మిల పరిస్థితి ఏమిటో?ఆమెకు టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అంగీకరిస్తారా?ఆమెకు పాలేరు నుంచి టికెట్ ఇవ్వలేని పక్షంలో కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.