ఊహించిన్నట్లే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీస్ పంపింది. ఈ కేసులో విచారణకు శుక్రవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొంది.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఏపీలోని వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లై తదితరులు అప్రూవర్లుగా మారి బెయిల్ పొంది ఒకరొకరిగా బయటకు వచ్చేసినప్పుడే, కల్వకుంట్ల కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకొంటున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఈడీ ఆమెకు నోటీస్ పంపింది.
అప్రూవర్లుగా మారిన వారందరూ ఇచ్చిన సాక్ష్యాధారాలు ఇప్పుడు ఈడీ చేతిలో ఉన్నాయి. కనుక ఆమెను విచారణ పేరుతో ఢిల్లీకి రప్పించి అరెస్ట్ చేయవచ్చు. ఈవిషయం ఆమెకు కూడా బాగా తెలుసు. కనుక విచారణకు హాజరుకాకుండా వాయిదా వేసేందుకు న్యాయపరంగా ప్రయత్నించవచ్చు.
ఒకవేళ తన అరెస్టు వలన తెలంగాణలో సానుభూతి, సెంటిమెంట్ పెరిగి బిఆర్ఎస్ పార్టీకి మేలు జరుగుటుందంటే దానికీ ఆమె సిద్దపడవచ్చు. మళ్ళీ ఈడీ నోటీసు వచ్చింది కనుక మళ్ళీ మంత్రులు, బిఆర్ఎస్ నేతలందరూ ప్రధాని నరేంద్రమోడీపై యుద్ధం ప్రారంభించవచ్చు.
శాసనసభ ఎన్నికలకు ముందు కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తే సిఎం కేసీఆర్ దానిని బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మలుచుకొని ఎన్నికలలో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తారని మోడీ, అమిత్ షాలకు కూడా బాగా తెలుసు.
బండి సంజయ్ మార్పుతో రాష్ట్రం బీజేపీ రాజకీయంగా వెనుకబడిపోయింది. దాని స్థానంలోకి కాంగ్రెస్ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఈడీ నోటీసుతో మళ్ళీ తెలంగాణలో బిఆర్ఎస్, బీజేపీల మద్య రాజకీయ యుద్ధం మొదలైతే, బీజేపీ మళ్ళీ ముందు వరుసలోకి రాగలుగుతుంది. బహుశః బీజేపీ దీని కోసమే మళ్ళీ ఈడీని రంగంలో దింపి ఉండవచ్చు. కనుక కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయించకుండా కేసీఆర్ మీద ఒత్తిడి చేయడానికి విచారణకే పరిమితం కావచ్చు.