సింగరేణి కార్మికులకు ఆ సంస్థ ఓ గొప్ప శుభవార్తను ప్రకటించింది. సింగరేణిలో 42,733 కార్మికులకు 11వ వేజ్ బోర్డు చెల్లించాల్సిన బకాయిలను ఈ నెల 21వ తేదీన చెల్లించబోతున్నట్లు వేజ్ బోర్డు ప్రకటించింది. మొత్తం రూ.1,726 కోట్లు కార్మికుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయబోతోంది. ఈ లెక్కన ఒక్కో కార్మికుడికి కనీసం రూ.2.80 లక్షల నుంచి గరిష్టంగా రూ.3.08 లక్షలు అందుకోబోతున్నారు.
ఇదిగాక సింగరేణి కార్మికులకు ఏటా దసరా, దీపావళి పండుగలకు ఇచ్చే బోనస్, శాలరీ అడ్వాన్స్ కూడా అందుకోబోతున్నారు. ఒక్కో కార్మికుడికి బోనస్, శాలరీ అడ్వాన్స్ కలిపి సుమారు రూ.2 లక్షల వరకు చేతికి అందుతుంటుంది. కనుక ఈ ఏడాది సింగరేణి కార్మికులు ఒక్కొక్కరూ దాదాపు రూ.4.50 నుంచి రూ.5 లక్షల వరకు అదనంగా అందుకోబోతున్నారు.
ఎన్నికల కోసమే: సింగరేణి 11వ వేజ్ బోర్డు 2021, జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది. అయితే అప్పటి నుంచి కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు. ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే చెల్లిస్తున్నట్లు భావించవచ్చు.
సింగరేణి కార్మికులు ఇంత భారీ మొత్తం ఏనాడూ అందుకోలేదు. ఇదే మొదటిసారి. కనుక కార్మికులు, వారి కుటుంబాలు చాలా సంతోషపడుతున్నారు. కనుక ఈసారి 42,773 మంది కార్మికులు, వారి కుటుంబాలు, బంధుమిత్రులు అందరూ బిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేయడం ఖాయం.
అంటే ఎన్నికలకు ముందు కార్మికులను ప్రసన్నం చేసుకొనేందుకే ఇంతకాలం బకాయిలు పెండింగ్ పెట్టి, ఇప్పుడు ఎన్నికలకు ముందు చెల్లిస్తుండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఏ కారణంతో కార్మికుల బకాయిలు చెల్లించడం ఆలస్యం చేసినప్పటికీ, ఇప్పుడు సుమారు 2-3 లక్షలకు పైగా సింగరేణి కార్మికుల ఓట్లను బిఆర్ఎస్ ఖాతాలో వేసుకోబోతోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు సింగరేణిలో కాంగ్రెస్, బీజేపీలను ముందే దెబ్బ తీసిందని భావించవచ్చు.