త్వరలో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతుండటంతో కాంగ్రెస్, బీజేపీలు తమ ముందున్న అన్ని మార్గాలను ఉపయోగించుకొంటూ ప్రజలకు చేరువయ్యేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఈ నెల 17న బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరిపేందుకు సిద్దం అవుతోంది.
ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని అనధికారికంగా ‘తెలంగాణ జాతీయత సమైక్యతా దినోత్సవం’ పేరుతో జరుపుతోంది. అయితే కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా తెలంగాణ విమోచన దినోత్సవం జరిపేందుకు సిద్దపడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం కూడా మొట్టమొదటిసారిగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ‘తెలంగాణ జాతీయత సమైక్యతా దినోత్సవం’ పేరుతో అధికారికంగా జరిపేందుకు సిద్దమైంది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈనెల 11న జీవో (నంబర్: 1268) జారీ చేసింది. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకం ఎగురవేసి ఈ వేడుకలలో పాల్గొంటారని, ఆదేవిదంగా అన్నీ జిల్లాలలో మంత్రులు లేదా జిల్లా ఉన్నతాధికారులు జెండా ఎగురవేసి ఈ వేడుకలను నిర్వహించాలని జీవోలో పేర్కొంది.