కాంగ్రెస్‌లో షర్మిల చేరికకు ముహూర్తం ఖరారైననట్లేనా?

September 13, 2023


img

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ ఎందుకో ఆలస్యమవుతోంది. ఈనెల 2 న ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆమె ప్రకటన చేస్తారనుకొంటే, ఇప్పుడు తగిన సమయంకాదని చెప్పి తప్పించుకొన్నారు. 

ఆమె కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు స్పష్టంగా చెప్పేసినందున, ఇప్పుడు తన పార్టీ తరపున ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించేలేని పరిస్థితి నెలకొంది. ఇంతకాలం ఆమెను నమ్ముకొని  వెనుక తిరిగిన నేతలు, కార్యకర్తలు కూడా ఇప్పుడు ఆమెతో పనిచేసేందుకు ఇష్టపడటం లేదు. ఈ కారణంగా తెలంగాణలో ఆమె దారులన్నీ మూసుకుపోయి కాంగ్రెస్‌లో చేరకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది ఆమె ఊహించని పరిణామమే అని చెప్పవచ్చు. 

కనుక ఈ నెల 15వ తేదీన ఢిల్లీ వెళ్ళి సోనియా, రాహుల్ గాంధీల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలని వైఎస్ షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమైనప్పటికీ ఈసారి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది లేకుంటే ఆమె రాజకీయ అనామకురాలిగా మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. 

కాంగ్రెస్‌లో చేరినా కూడా ఆమెకు కొత్త సమస్య ఎదురవ్యవచ్చు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆమెకు చోటు లేదని, ఆమె అవసరం కూడా లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. కనుక ఆమెను పక్కన పెట్టేస్తే ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు కాంగ్రెస్‌ అధిష్టానం సూచించిన్నట్లు ఏపీ కాంగ్రెస్‌కి వెళ్ళవలసిరావచ్చు. అదే జరిగితే ఆమెకు చాలా ఇబ్బందికరమే అవుతుంది. 


Related Post