శాసనసభ ఎన్నికలు వాయిదా? అయితే పరిస్థితి ఏమిటి?

September 13, 2023


img

అక్టోబర్ 10లోగా తెలంగాణ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకపోతే జమిలి ఎన్నికలు జరగవచ్చని మంత్రి కేటీఆర్‌ నిన్న చేసిన వ్యాఖ్యలు రాష్ట్రం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఆయన చెప్పిన అసలు విషయాన్ని పక్కనపడేసి ‘జమిలి ఎన్నికలు జరుగుతాయని కేటీఆర్‌ చెప్పారని’ మీడియాలో వార్తలు వస్తుండటం వలననే ఈ రాజకీయ ప్రకంపనలు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. 

అయితే ఇప్పటివరకు ఎన్నడూ ఎన్నికలు వాయిదా పడలేదు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల సంఘం అన్ని ఎన్నికలు నిర్వహిస్తోంది. కనుక కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తే తప్ప శాసనసభ ఎన్నికలలో ఎటువంటి మార్పు ఉండదు. 

తెలంగాణ శాసనసభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల కోసం కమిటీ వేసి, ఈనెల 18 నుంచి 22 వరకు అకస్మాత్తుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండటంతో, ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభను ముందుగా రద్దు చేసి జమిలి ఎన్నికలకు వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఒకవేళ ఆవిదంగా చేయాలనుకొంటే వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను ముందుకు జరిపి డిసెంబర్‌లోగా 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో కలిపి లోక్‌సభ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంటుంది తప్ప నవంబర్-డిసెంబర్‌లోగా జరగాల్సిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలను మార్చ్-ఏప్రిల్ వరకు వాయిదా వేయకపోవచ్చు.

అలా చేయాలంటే అప్పుడు తెలంగాణతో సహా 5 రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుంది. అందుకు ఆ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు అంగీకరించవు. తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. కనుక కేంద్రం అటువంటి ఆలోచన చేయకపోవచ్చు. కనుక శాసనసభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరగడం ఖాయమనే భావించవచ్చు.


Related Post