కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరాయింది. ఈ నెల 16న రాత్రి 7.55 గంటలకు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో సీఆర్‌పీఎఫ్ ఆఫీసర్స్ మెస్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. మర్నాడు ఉదయం రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమయ్యి, సభలో ప్రస్తావించాల్సిన అంశాలు, శాసనసభ ఎన్నికలు, పార్టీలో చేరికల గురించి చర్చిస్తారు.
అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకొని తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం ఎగురవేసి సైనిక వందనం స్వీకరిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ ముగిసిన తర్వాత మళ్ళీ పార్టీ నేతలతో మరోసారి సమావేశమయ్యి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్వహిస్తున్న ఈ సభలో అమిత్ షా ఏమి మాట్లాడారో తెలికగానే ఊహించవచ్చు. మజ్లీస్-బిఆర్ఎస్ అనుబందం, ఓవైసీల చేతిలో గులాబీ కారు స్టీరింగ్, కేసీఆర్ కుటుంబపాలన, అవినీతి, తెలంగాణలో బీజేపీ బలపడింది, తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్.. ఈ అంశాలు కాకుండా అమిత్ షా కొత్తగా ఏమైనా మాట్లాడుతారా?
ప్రతీసారి ఇదే పాట పాడటం వలన తెలంగాణ బీజేపీకి సభ నిర్వహణ శ్రమ తప్ప రాజకీయంగా ఒరిగేది ఏమిటి?
అమిత్ షా అంతటివారు హైదరాబాద్‌కి వస్తే కనీసం ఇతర పార్టీల నేతలెవరూ కూడా ఆయన సమక్షంలో బీజేపీలో చేరేందుకు ముందుకు రాకపోవడాన్ని ఏమనుకోవాలి?