పాపం బీజేపీ.. పాపం చీకోటి... ఎంత దుర్దశ!

September 13, 2023


img

కాసినో కింగ్, హవాలా కింగ్ అని పేరొందిన చీకోటి ప్రవీణ్ కుమార్‌కు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి షాక్ ఇచ్చారు. చీకోటి ప్రవీణ్ కుమార్‌ తాను బీజేపీలో చేరేందుకు ముందుగానే కిషన్‌రెడ్డికి తెలియజేసి, ఆయన అంగీకరించిన తర్వాతే బ్యాండ్ మేళం, భారీ ఊరేగింపుతో నిన్న ఉదయం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. కానీ అక్కడ కిషన్‌రెడ్డితో సహా పార్టీ పెద్దలెవరూ లేరు. దాంతో ఆయన షాక్ అయ్యారు. 

చీకోటిపై పలు ఆర్ధిక నేరాలకు సంబందించి కేసులున్నాయని కనుక అతనిని పార్టీలో చేర్చుకోవద్దంటూ ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్టానం హెచ్చరించడంతో కిషన్‌ రెడ్డి చివరి నిమిషంలో మొహం చాటేసిన్నట్లు తెలుస్తోంది. దీంతో అతను తీవ్ర నిరాశతో వెనుతిరిగాడు. 

తెలంగాణలో బీజేపీ చాలా బలపడిందని, త్వరలో ఇతర పార్టీల నుంచి నేతలు బీజేపీలో చేరబోతున్నారని బీజేపీ రాష్ట్ర బీజేపీ నేతలు పదేపదే చెప్పుకొనేవారు. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీని ఓడించి బీజేపీ అధికారంలోకి రాబోతోందని చెప్పుకొనేవారు. 

కానీ బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డిని నియమించుకొన్నాక పార్టీ పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రాకపోగా అందరూ కాంగ్రెస్ పార్టీకి క్యూ కడుతున్నారు. బీజేపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిమదంటే చివరికి ఆర్ధిక నేరగాడని ముద్రపడిన చీకోటి ప్రవీణ్ కుమార్‌ను పార్టీలో చేర్చుకొనేందుకు దిగజారిపోయిందని ప్రజలనుకొంటున్నారు. అతనిని పార్టీలో చేర్చుకోకపోయినా బీజేపీకి అటువంటి ఆలోచన ఉందనే విషయం స్వయంగా బయటపెట్టుకొని నవ్వులపాలైంది. 

బండి సంజయ్‌ నాలుగేళ్ళు ఎంతగానో శ్రమించి రాష్ట్రం బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని పార్టీ శ్రేణులకు, ప్రజలకు కల్పిస్తే బీజేపీ అధిష్టానం తీసుకొంటున్న ఇటువంటి తప్పుడు నిర్ణయాలతో ఆయన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతోందని బీజేపీ కార్యకర్తలే ఆవేదన చెందుతున్నారు.


Related Post