త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో పోటీ చేసేందుకు తెలంగాణ బీజేపీ దరఖాస్తులు ఆహ్వానించగా 119 స్థానాలకు 6,011 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వారిలో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున కూడా ఒకరు.
ఆమె సిఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకోవడం విశేషం. అంటే ఆమె ఈ ఎన్నికలలో కేసీఆర్‌ని ఎదుర్కోబోతున్నారన్న మాట. గజ్వేల్ నుంచి నేనే పోటీ చేసి కేసీఆర్‌ని ఓడిస్తానని ఈటల రాజేందర్ ఇదివరకు చెప్పారు. కానీ ఇప్పుడు తన భార్యను అక్కడి నుంచి బరిలో దింపుతుండటం ద్వారా వెనక్కు తగ్గిననట్లు భావించవచ్చు.
కేసీఆర్ చేతిలో ఆమె ఓడిపోయినా ఈటల రాజేందర్ ప్రతిష్టకు భంగం కలుగదు కానీ తాను పోటీ చేసి కేసీఆర్ చేతిలో ఓడిపోతే చాలా అప్రదిష్ట కలుగుతుంది. బహుశః అందుకే ఈటల రాజేందర్ తన భార్యను బరిలో దింపుతున్నట్లు భావించవచ్చు. ఓ రకంగా ఇది ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించడంగానే భావించవచ్చు.
ఈటల రాజేందర్ (హుజురాబాద్), రఘునందన్ రావు (దుబ్బాక), చింతల రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్), బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి (ముషీరాబాద్), సినీ నటి జీవిత (సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, సనత్ నగర్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి) నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకొన్నారు. పార్టీలో చాలా మంది సీనియర్లు ఈసారి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు.