తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వమే ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని బీజేపీ పదేపదే కోరుతున్నా సిఎం కేసీఆర్ పట్టించుకోలేదు. దీంతో ఏటా బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తూ కేసీఆర్‌ని విమర్షిస్తోంది. త్వరలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సిద్దం అయ్యింది.
కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ నిర్వహించకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి. అదీగాక ఆ రెండు పార్టీలు ఎన్నికలకు ముందు దీంతో బిఆర్ఎస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాయి. కనుక బిఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సిద్దమైంది.
ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జాతీయ సమైక్య దినోత్సవం నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
“సెప్టెంబర్ 17న తెలంగాణ భారతదేశంలో విలీనం అయినరోజు కనుక జాతీయ సమైక్య దినోత్సవం నిర్వహించాలి. కానీ కొందరు చరిత్రను కూడా వక్రీకరించి తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో మత రాజకీయాలు చేస్తున్నారు. సమాజంలో యువతకు భావితారాలకు కూడా చరిత్రలో ఈ వాస్తవం తెలియజేసేందుకు సెప్టెంబర్ 17న జాతీయ సమైక్య దినోత్సవం అట్టహాసంగా నిర్వహిస్తాము. హైదరాబాద్‌లో జరుగబోయే ఈ కార్యక్రమంలో సిఎం కేసీఆర్ కూడా పాల్గొంటారు,” అని కేటీఆర్ చెప్పారు.