మరో ముప్పై ఏళ్ళవరకు హైదరాబాద్‌ ఏ కొరత ఉండదు: కేటీఆర్‌

September 09, 2023


img

శనివారం హైటెక్స్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ షో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, “హైదరాబాద్‌ నగరం ఇప్పుడు ముంబై, బెంగళూరు వంటి నగరాలతో పోటీ పడుతూ వాటికంటే ముందుకు దూసుకుపోతోంది. ఒకప్పుడు నగరంలో నీళ్ళు, కరెంట్, సరైన రోడ్లు కూడా ఉండేవి కావు. ఒకప్పుడు కరెంట్ కోతల వలన జిరాక్స్ షాపులు కూడా నడిపించుకోలేని పరిస్థితి.

నీళ్ళ ట్యాంకర్స్ కోసం ఎదురుచూపులు, వచ్చాక నీళ్ళ కోసం కొట్లాటలు కనిపిస్తుండేవి.         కానీ ఇప్పుడు 24 గంటలు కరెంట్, నీళ్లు, విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు అన్నీ ఏర్పాటు చేసుకొన్నాము. కేసీఆర్‌ ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఈ సమస్యలన్నిటికీ శాస్విత పరిష్కారాలు సాధించారు. 

నానాటికీ పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌ నగరానికి వందల కిమీ దూరంలో ఉన్న కృష్ణగోదావరి జలాలు తీసుకువచ్చారు. మరో 30-35 ఏళ్ళ వరకు నగరంలో పెరిగే జనాభాను దృష్టిలో ఉంచుకొని సరిపడా నీళ్ళసౌకర్యాన్ని కల్పించారు. కనుక 2050 వరకు నగరానికి నీటి కొరత ఉండదు. విద్యుత్‌ సరఫరా, వినియోగంలో కూడా హైదరాబాద్‌ నగరం దేశంలో అగ్రస్థానంలో ఉంటోంది. 

ఇక హైదరాబాద్‌ అంటే గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్ సిటీ మాత్రమేనా అక్కడ అభివృద్ధి చేస్తే చాలా నగరంలో మిగిలిన ప్రాంతాలను పట్టించుకోరా?అని కొంతమంది వెటకారంగా మాట్లాడుతుంటారు. అయితే ఏ దేశంలోనైనా, నగరంలోనైనా కొన్ని ఐకానిక్ ప్రాంతాలు ఉంటాయి. అక్కడ నిత్యం అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్‌లో కూడా అలాగే జరుగుతోంది. అలాగని నగరంలో మిగిలిన ప్రాంతాలను మేము నిర్లక్ష్యం చేయడం లేదు. ఎల్బీనగర్ నుంచి హైటెక్ సిటీ వరకు అన్ని ప్రాంతాలలో రోడ్లు, ఫ్లైఓవర్లు, డ్రైనేజీ లైన్లు నిర్మిస్తూనే ఉన్నాము.  

హైదరాబాద్‌ అంటే ఏదో డబ్బా ఇళ్ళు మాత్రమే కాదు 30-40 అంతస్తుల భారీ భవనాలు కూడా ఉంటాయని మేము నిరూపించి చూపుతున్నాము. దేశంలో ముంబయి తర్వాత హైదరాబాద్‌లోనే స్కై స్క్రాపర్స్ ఎక్కువగా నిర్మాణం జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో దేశంలోనే హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలువబోతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఇటీవల నగరానికి వచ్చినప్పుడు హైదరాబాద్‌లో ఉన్నానా న్యూయార్క్ నగరంలో ఉన్నానా?అంటూ మన నగరాన్ని ప్రశంశించారు.

నగరంలో ఇప్పటివరకున్న మెట్రో భవిష్యత్‌లో నిర్మించబోతున్నదానితో పోలిస్తే చాలా చిన్నదవుతుంది. హైదరాబాద్‌ అవుటర్ రింగ్ రోడ్ వెంబడి 415 కిమీ పొడవునా మెట్రో కారిడార్‌ ఏర్పాటు చేయబోతున్నాము. రియల్ ఎస్టేట్ రంగం అంటే భూములు, అపార్ట్‌మెంట్‌లు అమ్మకాలు, కొనుగోళ్ళు మాత్రమే కాదు. ఒక్క రియల్ ఎస్టేట్ రంగంపైనే 30 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారంటే ఇది ఎంతగా ఎదిగిపోయిందో అర్దం చేసుకోవచ్చు. రాబోయే 10-15 సంవత్సరాలలో హైదరాబాద్‌ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది,” అని అన్నారు.            



Related Post