అవును... రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డే బిఆర్ఎస్ పార్టీకి ఓ శుభవార్త చెప్పారు. అదేమిటంటే, తెలంగాణలో జమిలి ఎన్నికలు జరుగవని, శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు వాటి షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కిషన్‌రెడ్డి చెప్పారు. జమిలి ఎన్నికల గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజంకావని వాటి గురించి అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేవలం కమిటీ వేసిందని చెప్పారు.
ఇది బిఆర్ఎస్‌కు శుభవార్త ఎందుకంటే, లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు కలిపి జరిగితే రాష్ట్రానికి సంబందించిన అంశాలపై చర్చకు బదులు జాతీయ అంశాలపై చర్చ జరుగుతుంది. దాని వలన బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాల గురించి గట్టిగా చెప్పుకొని ప్రజలను ఓట్లు కోరే అవకాశం తగ్గుతుంది.
అదీగాక ఒకేసారి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరిగితే గ్రామీణ ప్రజలు, నిరక్షరాస్యులు అయోమయానికి గురై బిఆర్ఎస్‌కు బదులు వేరే పార్టీలకు వేరే అభ్యర్ధులకు ఓట్లు వేస్తే నష్టపోతుంది. శాసనసభ ఎన్నికలను ముందుగా జరిపితే వాటిపై పూర్తిగా దృష్టిపెట్టి విజయం సాధించవచ్చు.
అందుకే కేసీఆర్ గత ఎన్నికలలో ముందస్తుకు వెళ్ళి రెండు ఎన్నికలను విడదీశారు. ఒకవేళ మళ్ళీ రెండు కలిపి నిర్వహిస్తే కేసీఆర్ ఈ ఆలోచన, ఈ ప్రయత్నం అంతా వృధా అవుతుంది. కనుక శాసనసభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరగలనే కోరుకొంటారు. కిషన్ రెడ్డి అలాగే జరుగుతుందని చెప్పారు. కనుక ఇది బిఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా శుభవార్తే అవుతుంది.
రాష్ట్రంలో బిజెపి కార్యక్రమాల గురించి వివరిస్తూ, ఈనెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి యాత్రలు, బైక్ ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహించబోతున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగసభకు కేంద్ర హోంమంత్రి అమిత్ అమిత్ షా వచ్చి త్రివర్ణ పతాకం ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలలో పాల్గొంటారని చెప్పారు.
ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో ఆరోగ్య, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.