తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో తాజ్ కృష్ణ హోటల్‌లో సమావేశమయ్యి అభ్యర్ధుల జాబితాపై సుదీర్గంగా చర్చించింది. సమావేశం ముగిసిన ఎటువంటి ప్రకటన చేయకుండానే అందరూ వెళ్ళిపోయారు.
రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి సీనియర్ నేతలు పోటీ చేసే 35 స్థానాలలో వేరెవరూ దరఖాస్తు చేసుకోలేదు. వారి పేర్లు ప్రకటించడానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఇద్దరు కంటే ఎక్కువ మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకొన్న మరో 40 స్థానాలలో అభ్యర్ధులపై ఈ సమావేశంలో చర్చించి అభ్యర్ధులను ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. కనుక 75 మంది కూడిన ఆ జాబితాను కాంగ్రెస్ కేంద్ర కమిటీకి పంపించి ఈ నెలాఖరులోగా జరిగే తదుపరి సమావేశంలో తొలి జాబితాను ప్రకటించవచ్చు.
మురళీధరన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బాబా సిద్దిఖీ, ఏఈసీసీ కార్యదర్శులు విశ్వనాధ్, మన్సూర్ ఆలీఖాన్, రోహిత్ చౌదరి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశానికి రెండు రోజుల ముందు మురళీధరన్ స్వయంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యి ఎవరు అభ్యర్ధులుగా ఉండాలనే దానిపై అభిప్రాయాలు తెలుసుకొన్నారు. స్క్రీనింగ్ కమిటీ, ఏఐసీసీ కమిటీలలో చేర్చుకోకపోవడంపై సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలకపాన్పు ఎక్కారు. ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.