హైదరాబాద్‌లో వరదలు... తెలంగాణకు పెట్టుబడుల వరదలు

September 06, 2023


img

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ నగరంలో రోడ్లు, కాలనీలలో వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణకు పెట్టుబడుల వరద కూడా ప్రవహిస్తోంది. తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ పెట్టుబడుల వేటలో భాగంగా దుబాయ్‌లో పర్యటిస్తున్నారు.

యూఏఈలో అగ్నిమాపక పరికరాలను తయారుచేసే సంస్థ నాఫ్కో తెలంగాణలో రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. ఆ కంపెనీ సీఈవో ఖాలిద్ అల్ ఖతీబ్‌తో మంగళవారం మంత్రి కేటీఆర్‌ బృందం సమావేశమైనప్పుడు తెలంగాణలో అగ్నిమాపక పరికరాల తయారీ పరిశ్రమతో పాటు, ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలని కోరగా అందుకు ఆయన అంగీకరించారు. 

తర్వాత యూఏఈలో ప్రముఖ పోర్ట్ ఆపరేటర్‌గా పేరొందిన డీపీ వరల్డ్ గ్రూప్ ఉపాధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మెహతా, డైరెక్టర్ సాలూష్ శాస్త్రిలతో కేటీఆర్‌ బృందం దుబాయ్‌లో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.165 కోట్ల పెట్టుబడితో ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో ఆపరేషన్, రూ.50 కోట్ల పెట్టుబడితో మేడ్చల్లో భారీ కోల్డ్ స్టోరేజ్ వేర్ హౌస్‌ను ఏర్పాటు చేసేందుకు వారు అంగీకరించారు. 

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసి, రీటెయిల్ మార్కెట్, ప్రాసెసింగ్ యూనిట్స్ రంగాలలో ప్రసిద్ధి చెందిన సంస్థ లులూ. ఈ సంస్థ ఛైర్మన్‌ యూసుఫ్ అలీతో కేటీఆర్‌ బృందం మంగళవారం దుబాయ్‌లో సమావేశమైంది. లులూ గ్రూప్ రూ.1,000 కోట్లతో ఆక్వా క్లస్టర్ ఏర్పాటు చేసి తెలంగాణలో తమ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు యూసుఫ్ అలీ అంగీకరించారు. 

రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఆక్వా ఉత్పత్తులను సేకరించెండుకుగాను, అక్కడ భారీ కోల్డ్ స్టోరేజ్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని యూసుఫ్ అలీ చెప్పారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా అనేక మందికి ఉపాధి లభిస్తాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 

యూఏఈకి చెందిన మలబార్ గ్రూప్ తెలంగాణలో ఇప్పటికే గోల్డ్ రిఫైనరీ రంగంలో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు మరో రూ.125 కోట్ల పెట్టుబడితో ఫర్నీచర్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఆ సంస్థ ఛైర్మన్‌ ఎంపీ అహ్మద్ వేరే దేశంలో ఉన్న కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దుబాయ్‌లో ఉన్న కేటీఆర్‌ బృందంతో సమావేశమయ్యి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 1,000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా అనేక మందికి ఉపాధి లభిస్తాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 


Related Post