త్వరలో జరుగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపి, సీపీఐ, సీపీఎం పార్టీలతో పాటు మరో జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడ బరిలో దిగబోతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఇంతకాలం రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ప్రజలు ఏదో ఓ పార్టీకి ఓట్లేస్తూ వాటి చేతుల్లో పావులుగా మిగిలిపోయారు. కానీ బడుగు బలహీనవర్గాల కోసమే ఆవిర్భవించిన బీఎస్పీకి ఓట్లేసి మనల్ని మనం గెలిపించుకొని రాజ్యాధికారం సాధించుకొందాము.
ఈసారి శాసనసభ ఎన్నికలలో అన్ని స్థానాలకు బీఎస్పీ పోటీ చేయబోతోంది. 119 స్థానాలలో 60 నుంచి 70 స్థానాలు బీసీలకే కేటాయించబోతున్నాము. త్వరలోనే బీఎస్పీ అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించబోతున్నాము. ఈసారి బడుగు బలహీనవర్గాల ప్రజలందరూ పెత్తందారుల పార్టీల మాయలో పడకుండా ఒక్కటిగా నిలిచి బీఎస్పీని గెలిపించుకోవాలని కోరుతున్నాను,” అని అన్నారు.
పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్, ఆరేళ్ళ సర్వీసు ఉండగానే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి గత రెండేళ్ళుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బడుగు బలహీనవర్గాల ప్రజలను చైతన్య పరిచేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు.
అయితే ఎన్నికలు దగ్గర పడనంతవరకు ప్రజలు ఎవరేమి చెప్పినా వింటారు. చప్పట్లు కొడతారు. కానీ ఎన్నికల సమయంలో ఓటర్ల ఆలోచన ధోరణి పూర్తిగా మారిపోతుంది. ప్రస్తుతం బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిల ప్రభావం తీవ్రంగా ఉంది. పైగా మూడు పార్టీల అభ్యర్ధులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేయడానికి సిద్దంగా ఉన్నారు. కనుక వారి ముందు బీఎస్పీ అభ్యర్ధులు నిలబడగలుగుతారా? ప్రవీణ్ కుమార్ హితోక్తులు ఫలిస్తాయా? అంటే అనుమానమే. కనుక ఈ ఎన్నికలు ప్రవీణ్ కుమార్‌కి అగ్నిపరీక్షవంటివే అని చెపొచ్చు.