స్టేషన్‌ఘన్‌పూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఈసారి కేసీఆర్ టికెట్ నిరాకరించి కడియం శ్రీహరికి ఇవ్వడంతో మొదట బోరున ఏడ్చిన రాజయ్య, తేరుకొని కాంగ్రెస్, బిజెపిలతో మంతనాలు ప్రారంభించారు. సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహతో హైదరాబాద్‌లో ఓ స్టార్ హోటల్‌లో సుమారు 45 నిమిషాలసేపు రహస్యంగా భేటీ అయ్యారు.
స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి కాంగ్రెస్ టికెట్‌తో పాటు రాజయ్య మరికొన్ని డిమాండ్స్ పెట్టగా, కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు టికెట్ ఇచ్చేందుకు దామోదర రాజనర్సింహ రాజయ్యకు హామీ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇవ్వకపోవడం వలననే రాజయ్య పక్కచూపులు చూస్తున్నారు కనుక కాంగ్రెస్ హామీతో సంతృప్తి వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించవచ్చని తెలుస్తోంది.
అయితే మంత్రి కేటీఆర్ చెప్పిన్నట్లు బిఆర్ఎస్ వద్దనుకొన్న ఎమ్మెల్యేలను, నేతలను కాంగ్రెస్, బిజెపిలు పోటీలు పడి తెచ్చుకొని టికెట్స్ ఇచ్చి బరిలో దింపిన్నట్లయితే, రాజకీయాలలో నైతిక విలువలను పాటించని అటువంటివారు ఎన్నికలలో గెలిస్తే మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలో చేరిపోవడం ఖాయం. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి కూడా. కనుక ఎవరు పడితే వారిని తెచ్చేసుకొని టికెట్లు ఇస్తే చివరికి అదే నష్టపోతుంది. బిజెపికి కూడా ఇదే వర్తిస్తుంది.