కేంద్ర ఎన్నికల కమీషన్ సోమవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి, రాష్ట్ర శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి వేర్వేరుగా లేఖలు పంపింది. తెలంగాణ హైకోర్టు ఆదేశం మేరకు డికె అరుణను తక్షణం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఓ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని దానిలో ఆదేశించింది.
2018 ముందస్తు ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్‌లో సమర్పించినట్లు హైకోర్టు ధృవీకరించి, ఆయనపై అనర్హత వేటు వేసి ఆయన చేతిలో ఓడిపోయిన డికె అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు గాను ఆయనకు రూ.3 లక్షల జరిమానా కూడా విధించింది. దానిలో రూ.50 వేలు డికె అరుణకు చెల్లించవలసిందిగా హైకోర్టు ఆదేశించింది.
ఇంతకు ముందు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై ఇదే కారణంతో హైకోర్టు అనర్హుడిగా ప్రకటించి, జలగం వెంకట్ రావుని ఎమ్మెల్యేగా తీర్పు చెప్పగా వనమా వెంటనే సుప్రీంకోర్టుని ఆశ్రయించి స్టే తెచ్చుకొని ఈ సమస్య నుంచి బయటపడ్డారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించడంలో ఆలస్యం చేయడంతో ఈలోగా ఈసీ నేడు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కృష్ణమోహన్ రెడ్డి కూడా నేడు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కానీ డికె అరుణను ఎమ్మెల్యేగా ధృవీకరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే, అప్పుడు ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా కలుగజేసుకోకపోవచ్చు.