బిజెపిలో ముషీరాబాద్ టికెట్‌ ఎవరికో?

September 04, 2023


img

సిఎం కేసీఆర్‌ 115 మంది బిఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించి అప్పుడే 10 రోజులు కావస్తోంది. కానీ ఇంతవరకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించలేదు. కానీ ఈవారంలోనే ప్రకటించడానికి గట్టి కసరత్తు చేస్తున్నాయి. సికింద్రాబాద్‌ పరిధిలో ముషీరాబాద్ నుంచి ఈసారి బిజెపి అభ్యర్ధులుగా సీనియర్ నేత కె లక్ష్మణ్, హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.

దీనిపై ఆమె స్పందిస్తూ, “మా నాన్నగారు గత 30-40 ఏళ్లుగా బిజెపిలో ఉన్నందున, నాకు పార్టీలో అందరితో మంచి పరిచయాలున్నాయి. నేను 2014,2019 జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బిజెపి ప్రచారంలో పాల్గొన్నాను. అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నాను. కనుక ఒకవేళ నేను తగిన అభ్యర్ధినని పార్టీ అధిష్టానం భావించి నాకు టికెట్‌ ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాను. అలాగని నాకు టికెట్‌ ఇవ్వమని నేను ఎవరినీ అడగలేదు. అడగబోను కూడా. ఒకవేళ టికెట్‌ ఇవ్వకపోయినా నేనేమీ బాధపడను. ఎప్పటిలాగే బిజెపి కోసం పనిచేస్తుంటాను,” అని విజయలక్ష్మి అన్నారు. 

కె లక్ష్మణ్ కూడా ఇంచుమించు ఇటువంటి అభిప్రాయమే వ్యక్తం చేయడం విశేషం. “ఒకవేళ టికెట్‌ ఇస్తే పోటీ చేస్తానని లేకుంటే ఎప్పటిలాగే బిజెపి కోసం పనిచేస్తుంటానని” చెప్పారు. ఒకే చోట నుంచి పోటీ చేయాలనుకొంటున్న ఇద్దరు బిజెపి అభ్యర్ధులు ఇంత హుందాగా వ్యవహరిస్తుండటం అభినందనీయమే కదా?

ముషీరాబాద్ నుంచి బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మళ్ళీ పోటీ చేయబోతున్నారు. 


Related Post