రాజన్న భజనతో షర్మిల... రేవంత్‌ రెడ్డి కిం కర్తవ్యం?

September 02, 2023


img

వైఎస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌లో చేరటం దాదాపు ఖాయమైపోయింది. ఈ విషయం ఆమె స్వయంగా పంజగుట్టలో తన తండ్రి విగ్రహం సాక్షిగా చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ఎప్పటిలాగే రాజశేఖర్ రెడ్డి భజన చేశారు. నిజానికి ఆమె తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నంతకాలం రాజన్న భజనే చేస్తూ తిరిగారు. ఇప్పుడు కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టినా ఆయన భజనే చేయబోతున్నారు. ఇది కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టబోతోంది. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలలో తెలంగాణ సెంటిమెంట్ బలపడింది. తెలంగాణ రాష్ట్రం, ప్రజలు, పండుగలు, ఆచారాలు, స్థానిక సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాలతోనే అన్ని రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి. కనుక ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరి దాని సభలలో పాల్గొని వేదికలపై నుంచి రాజన్న భజన చేస్తే అది బిఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్‌గా మారుతుంది. ప్రతీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ వాడుకొంటూ లబ్ధిపొందుతూనే ఉంటుంది. ఈసారి బిజెపి అకస్మాత్తుగా వెనకబడి దాని స్థానంలోకి దూసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్‌ పార్టీకి గట్టి సవాలే విసురుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఆంద్రాకు చెందిన వైఎస్ షర్మిలను కాంగ్రెస్‌లో తెచ్చుకోవడంతో బిఆర్ఎస్‌కు వరమనే చెప్పాలి. గత ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని బూచిగా చూపించిన బిఆర్ఎస్‌ పార్టీ ఈసారి వైఎస్ షర్మిలను చూపించి కాంగ్రెస్‌ను దెబ్బ తీయడానికి ప్రయత్నించడం ఖాయం. అందుకే ఆమె అవసరం లేదని రేవంత్‌ రెడ్డి చెప్పినా కాంగ్రెస్‌ అధిష్టానం వినకుండా వైఎస్ షర్మిలని తెచ్చి దింపుతోంది. రాజన్న భజన చేయకుండా ఆమెను కాంగ్రెస్‌లో ఎవరూ ఆపలేరు. ఆపకపోతే కాంగ్రెస్‌ కొంప మునిగిపోవడం ఖాయం.           



Related Post