తెలంగాణ కాంగ్రెస్‌ టికెట్లలో షర్మిల కోటా ఎంతో?

September 02, 2023


img

ఈరోజు వైఎస్ షర్మిల పంజాగుట్టలోని తన తండ్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీలో మా పార్టీ విలీనం చర్చలు కొలిక్కివచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఆ తండ్రిగారిని గౌరవిస్తున్నందునే నేను సోనియా, రాహుల్ గాంధీలతో చర్చలకు వెళ్ళాను. మా చర్చలలో ప్రధానంగా తెలంగాణలో కేసీఆర్‌ని ఏవిదంగా గద్దె దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావలనే అంశం మీదనే సాగాయి. 

త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో కేసీఆర్‌ని మేము గద్దె దించడం ఖాయం. ఇదే లక్ష్యంతో పనిచేస్తున్న వారందరూ మాతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కేసీఆర్‌ని గద్దె దించడం కోసం నేను కూడా ఎన్నికలలో పోటీ చేయబోతున్నాను. నాతో పాటు మా పార్టీలో మరికొందరు కూడా ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు,” అని చెప్పారు.

ఈసారి కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నట్లు అందరూ భావిస్తుండటంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు పెరిగాయి. టికెట్ల కోసం సుమారు 1,600 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వైఎస్ షర్మిలవంటివారు ఇంకా చాలా మంది చేరబోతున్నారు. వారందరూ కూడా టికెట్స్ ఆశిస్తున్నారు. కనుక టికెట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో చాలా పోటీ ఏర్పడింది. 

ఈ పరిస్థితులలో వైఎస్ షర్మిల ఒక్కరికే టికెట్‌ ఇవ్వడం కష్టమనుకొంటే, తన అనుచరులు కూడా పోటీ చేయబోతున్నారంటూ ఆమె బాంబు పేల్చారు. వైఎస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌కు అవసరం లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెపితే, ఆమె కాంగ్రెస్‌లో చేరుతుండటమే కాకుండా అప్పుడే టికెట్స్ కూడా డిమాండ్‌ చేస్తున్నారు. ఇది తెలంగాణ కాంగ్రెస్‌కు చాలా ఇబ్బందికరంగానే మారవచ్చు.


Related Post