ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయడంతో ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ కేంద్రమంత్రులు, బిజెపి ఎంపీలు, బిజెపి నేతలు ఎవరూ కూడా ఈ ఊహాగానాలను ఖండించడం లేదు.
ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం గుంటూరు జిల్లాలో బిజెపి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు విలేఖరులతో మాట్లాడుతూ, “ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జమిలి ఎన్నికల ప్రకటన కోసమే అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ సమావేశాలు మరెంతో దూరం లేవు కదా? చూద్దాం ఏం జరుగుతుందో? ఒకవేళ జమిలి ఎన్నికలొస్తే బిజెపితో సహా అన్ని పార్టీలు ఎదుర్కోక తప్పదు కదా?” అని అన్నారు.
ఆమె ఈ ఊహాగానాలను ఖండించకుండా ఈవిదంగా మాట్లాడటం గమనిస్తే ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నట్లు అనుమానించవలసివస్తోంది.
ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాలు మళ్ళీ మరోసారి ఎన్నికలలో గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావాలని కోరుకొంటున్నారు కనుక బిజెపికి, తమ ఎన్డీయే కూటమికి అత్యంత అనుకూలమైన సమయంలోనే ఎన్నికలకు వెళ్ళాలనుకోవడం సహజమే కదా?దేశంలో కాంగ్రెస్, ఇండియా కూటమి బలపడక మునుపే ఎన్నికలకు వెళ్ళాలనుకొంటున్నారేమో?
సాధారణంగా ఎన్నికలకు ముందే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వరాలు ప్రకటిస్తుంటాయి. వంటగ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రూ.200 తగ్గించి మొదటివరం ప్రకటించింది. ఒకవేళ పార్లమెంట్ సమావేశాలలోగా మరిన్ని వరాలు కురిపిస్తే ముందస్తు, జమిలి ఎన్నికలు ఖాయమనే భావించవచ్చు.