సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. వాటికి బలం చేకూర్చుతున్నట్లు జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి సిఫార్సు చేసేందుకు మాజీ రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అంశంపై మోడీ ప్రభుత్వం చాలా కాలంగా మాట్లాడుతూనే ఉంది. అయితే అన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను, లోక్‌సభ ఎన్నికలను కలిపి ఒకేసారి నిర్వహించడంలో అనేక ఇబ్బందులు ఉన్నందున అది సాధ్యపడటం లేదు. ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. లోక్‌సభ ఎన్నికలతో కలిసి శాసనసభ ఎన్నికలకు వెళితే మిశ్రమ ఫలితాలు వస్తాయనే ఆలోచనతో కేసీఆర్ ముందస్తుకు వెళ్ళారు. కనుక మళ్ళీ డిసెంబర్‌లోగానే శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు కలిపి నిర్వహించాలని భావిస్తే కధ మళ్ళీ మొదటికొస్తుంది.
కనుక బిఆర్ఎస్‌తో సహా దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనను వ్యతిరేకించడం ఖాయమే. అయితే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకొంటే రాష్ట్ర ప్రభుత్వాలు దానిని ఆపలేకపోవచ్చు. కనుక పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ఏమి జరుగుతుందనేది చాలా ఆసక్తికరంగా మారింది.