పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం మధ్యాహ్నం ట్విట్టర్‌లో “17వ లోక్‌సభలో 13వ సెషన్ మరియు రాజ్యసభ 261వ సెషన్ ప్రత్యేక సమావేశాలను సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజులు నిర్వహించబోతున్నాము. ఈ అమృత కాలంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలలో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని భావిస్తున్నాం,” అని ట్వీట్ చేశారు.
అయితే ఇంత ఆకస్మికంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎందుకు నిర్వహించబోతున్నారో కారణం తెలుపలేదు. ఈ ఏడాది డిసెంబర్‌లోగా లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండు రోజుల క్రితమే అన్నారు. ఈ డిసెంబర్‌లోగా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. వాటి ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కనుక ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభను రద్దు చేసి వాటితో కలిపి ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు సిద్దమవుతున్నారేమో?
ఓ వైపు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి, మరోవైపు మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ బలపడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బిజెపిని ఓడించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా క్రమంగా బలం పుంజుకొంటోంది. కనుక ఈ ప్రత్యేక సమావేశాలలో లోక్‌సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు ప్రకటిస్తారేమో? ఇదివరకు ఆకస్మికంగానే పెద్దనోట్ల రద్దు, లాక్‌డౌన్ ప్రకటించారు కదా? కనుక ఇప్పుడూ అలాగే చేసినా ఆశ్చర్యం లేదు.