మంత్రి హరీష్ రావు గురువారం తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఢిల్లీ నుంచి పోలిటికల్ టూరిస్టులు వచ్చి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడిపోతుంటారు. అమిత్ షా కూడా అలాగే వచ్చి వెళ్ళారు. ఆయనకు తెలంగాణ గురించి అవగాహన లేదు. అందుకే ఇక్కడ నేతలు వ్రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోయారు.
వచ్చినప్పుడల్లా కొత్త కొత్త నినాదాలు చేస్తుంటారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు స్లోగన్లకే పరిమితమైన పార్టీలు కాగా మా బిఆర్ఎస్ పార్టీ అన్ని ప్రజా సమస్యలకు సోల్యూషన్స్ చూపే పార్టీ. మేము ఇచ్చిన ప్రతీ హామీని అమలుచేసి చూపుతుంటాము.
ఈ ప్రపంచంలోనే 125 అడుగుల ఎత్తైన డా.అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసి బడుగు బలహీనవర్గాల ప్రజల పట్ల మా గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకొన్నాము. డా.అంబేడ్కర్ చూపిన బాటలో మా ప్రభుత్వం నడుస్తుంటుంది,” అని అన్నారు.
కాంగ్రెస్ నేతలు ఇస్తున్న హామీల గురించి ప్రస్తావిస్తూ, “పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే కదా ఇప్పుడు అధికారంలో ఉంది. ఇక్కడ ప్రకటిస్తున్న హామీలన్నిటినీ ముందు అక్కడ అమలుచేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకొంటే బాగుంటుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అమలుచేయని హామీలను ఇక్కడ అధికారంలోకి వస్తే అమలుచేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారు,“ అని మంత్రి హరీష్ రావు విమర్శించారు.
బిజెపి, కాంగ్రెస్ పార్టీల గురించి మంత్రి హరీష్ రావు చెప్పిన మాటలు వాస్తవమే అని అందరికీ తెలుసు. కనుక ఆకర్షణీయమైన నినాదాలకో లేదా ఆచరణ సాధ్యం కానీ హామీలకో మోసపోకుండా విజ్ఞతతో ఓటు వేసి సరైనవారికి అధికారం అప్పజెప్పడం చాలా అవసరమే. పొరుగున ఏపీలో ప్రజలు ఇలా మాయమాటలతో మోసపోయి ఇప్పుడు ఎంతగా చింతిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు కదా?