సోనియాతో షర్మిల భేటీ... విలీనానికి ముహూర్తం ఎప్పుడో?

August 31, 2023


img

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు ఉదయం ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణకు అంశాలపై మేము చర్చించాము. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు నేను పనిచేస్తాను,” అని క్లుప్తంగా ముంగించేశారు. 

దీంతో ఆమె కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని స్పష్టమైంది. కానీ దానికి ముహూర్తం ఇంకా ప్రకటించవలసి ఉంది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆమెకు చోటు లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కుండబద్దలు కొట్టిన్నట్లు ముందే చెప్పినప్పటికీ, ఆమె తెలంగాణ కాంగ్రెస్‌లోనే చేరబోతున్నట్లు ఆమె మాటలతో అర్దమవుతోంది. 

ఆమె పాలేరు నుంచి శాసనసభకు పోటీ చేయాలనుకొంటున్న సంగతి తెలిసిందే.. అయితే ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాలేరు నుంచే పోటీ చేయాలనుకొంటున్నారు. కనుక వైఎస్ షర్మిలకు అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఆమె చేరికను రేవంత్‌ రెడ్డి వ్యతిరేకిస్తునందున కొత్త సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఆమెను జాతీయ కార్యవర్గంలోకి తీసుకొని ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలలో ఆమె సేవలను ఉపయోగించుకోవచ్చు.


Related Post