ఏపీ, తెలంగాణలలో డబుల్ ఇంజన్ సర్కారులే ఉన్నాయిగా?

August 30, 2023


img

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌లను ఉద్దేశ్యించి సీపీఐ సీనియర్ నేత నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్రమోడీ కనుసన్నలలోనే పనిచేస్తుంటారు. మోడీ ప్రభుత్వానికి అవసరమైనప్పుడల్లా సహాయపడుతుంటారు. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో బిజెపి చెప్పుకొంటున్న డబుల్ ఇంజన్ సర్కారులు ఇవే.  

ఒకవేళ జగన్‌, కేసీఆర్‌లకు నిజంగానే మోదీతో రహస్య సంబంధాలు లేకుంటే విభజన హామీల గురించి గట్టిగా నిలదీసి సాధించుకొని ఉండేవారు కదా? కేసీఆర్‌ పైకి మోడీ… గీడీ అని ఏదేదో అంటారు కానీ ఆయన మద్దతు మోడీకే అని ఈ 10 ఏళ్ల పాలనలో పలుమార్లు నిరూపించారు. 

రెండు రాష్ట్రాలలో బిజెపి లోక్‌సభ సీట్లు గెలుచుకోలేకపోయినా ఇక్కడ బిఆర్ఎస్‌ ఎంపీలు, అక్కడ వైసీపీ ఎంపీలు మోడీ ప్రభుత్వానికే మద్దతు ఇస్తారు. కనుక బిజెపి చింతించవలసిన విషయమేమీ లేదు. 

ప్రధాని నరేంద్రమోడీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తన గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తుంటే, వారిద్దరూ రాష్ట్రంలో ప్రతిపక్షాలను తమ గుప్పెట్లో పెట్టుకొని ఆడించాలని ప్రయత్నిస్తుంటారు. తెలంగాణలో కాంగ్రెస్‌, వామపక్షాలు కలిసి పోటీ చేస్తే బిఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది, “ అని అన్నారు. 

నారాయణ మాటలు కాస్త కటువుగా ఉన్నా ఆయన చెప్పినవన్నీ వాస్తవాలే అని అందరికీ తెలుసు. అయితే ఈ రాజకీయ చక్రబందంలో నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు, వాటిలో రాజకీయ పార్టీలు బయటపడటం చాలా కష్టమే. ఎందుకంటే అన్ని పార్టీల నేతలకు ఏదో ఓ అక్రమాల కేసుతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉంటోంది. వాటినే వారి ప్రత్యర్ధులు ఆయుధాలుగా ఉపయోగించుకొని రాజకీయ చదరంగం ఆడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు కదా?


Related Post