తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. అంతకు ముందు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన తర్వాత తెలంగాణలో టిడిపి ఒంటరిగా పోటీ చేస్తుందని, బిజెపితో పొత్తులకు సమయం మించిపోయిందని చెప్పారు.
ఏపీలో చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న వైసీపీని ఎదుర్కొనేందుకు బిజెపితో పొత్తులు పెట్టుకొని కేంద్రం సహాయసహకారాలు పొందాలని చంద్రబాబు నాయుడు భావించారు. అందుకు ప్రతిగా తెలంగాణలో బిజెపికి సహకరించేందుకు సిద్దపడ్డారని ఊహాగానాలు వినిపించాయి. కానీ తెలంగాణలో టిడిపితో పొత్తులు పెట్టుకొంటే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్ రాజేసి లబ్ధి పొందుతుందని బహుశః బిజెపి టిడిపితో పొత్తులకు నిరాకరించి ఉండవచ్చు. దానినే చంద్రబాబు నాయుడు మరోవిదంగా చెప్పుకొన్నారనుకోవచ్చు.
కనుక టిడిపి, బిజెపిలు వేర్వేరుగా పోటీకి సిద్దమవుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు కేంద్రం సహాయసహకారాలు ఆశిస్తున్న కారణంగా తెలంగాణలో బిజెపికి పరోక్షంగా సహకరించడం ఖాయమే అని భావించవచ్చు. కనుక టిడిపి కూడా బరిలో దిగడం వలన కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకి ఎంతో కొంత నష్టం తప్పదు.