మళ్ళీ బిఆర్ఎస్‌ అభ్యర్ధుల సర్వే... నిజమా?

August 29, 2023


img

సిఎం కేసీఆర్‌ ఒకేసారి 115 మంది బిఆర్ఎస్‌ అభ్యర్ధులను ప్రకటించినప్పుడు ప్రతిపక్షాలే కాదు... బిఆర్ఎస్‌ నేతలు, ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. ఆరోజు నుంచి మేము అందరు అభ్యర్ధులను ప్రకటించేశాము కానీ ప్రతిపక్షాలు ప్రకటించలేకపోతున్నాయి. ఎందుకంటే వాటికి అభ్యర్దులే లేరంటూ బిఆర్ఎస్‌ నేతలు గొప్పగా చెప్పుకొంటున్నారు.

అయితే తాజావార్త ఏమిటంటే, కేసీఆర్‌ మళ్ళీ 34 నియోజకవర్గాలలో అభ్యర్ధులపై సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. అభ్యర్ధుల జాబితా ప్రకటించిన తర్వాత అనేక నియోజకవర్గాలలో ఆశావాహులు, మళ్ళీ టికెట్‌ లభించని సిట్టింగ్ ఎమ్మెల్యేలు బాహాటంగానే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు.

కొందరు పార్టీకి రాజీనామాలు చేసి కాంగ్రెస్‌లో చేరిపోతున్నట్లు ప్రకటిస్తున్నారు. ఈ నేపధ్యంలో కేసీఆర్‌ పునరాలోచనలో పడి, 34 నియోజకవర్గాలలో మళ్ళీ అభ్యర్ధుల పనితీరు, ప్రజాధరణపై సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో కనీసం 20మందికి బీ-ఫార్మ్ లభించడం కష్టమే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

బిజెపికి అభ్యర్ధులే లేరంటూ బిఆర్ఎస్‌ నేతలు చేస్తున్న విమర్శలపై బండి సంజయ్‌ స్పందిస్తూ అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుంది. “కేసీఆర్‌ 115 మందికి టికెట్స్ కేటాయిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఎన్నికల గంట మ్రోగేసరికి ఈ జాబితా  ఉండదు. కొత్త అభ్యర్దులతో మరో కొత్త జాబితా కేసీఆర్‌ బయటకు తీస్తారు. ఇప్పుడు ప్రకటించిన వారిలో చాలా మందికి కేసీఆర్‌ టికెట్స్ ఇవ్వరు. టికెట్‌ లభించదేమో అనే అనుమానంతో నేతలు పార్టీ వీడకుండా ఉండేందుకే కేసీఆర్‌ హడావుడిగా 115 మందితో జాబితా ప్రకటించేశారు,” అని అన్నారు. 

ఒకవేళ కేసీఆర్‌ మళ్ళీ సర్వే చేయిస్తుండటం నిజమే అయితే బండి సంజయ్‌ చెప్పింది నిజమే అని భావించాల్సి ఉంటుంది.


Related Post