తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్, బిజెపిలు కూడా పోటాపోటీగా రాష్ట్రంలో సభలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళలో, బిజెపి ఖమ్మంలో బహిరంగసభలు నిర్వహించాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకొంటోంది. కానీ బిజెపి సభలలో సిఎం కేసీఆర్ నియంతృత్వ పాలన చేస్తున్నారని, మజ్లీస్‌తో దోస్తీ చేస్తున్నారని ఆరోపిస్తూ అరిగిపోయిన రికార్డునే వినిపిస్తున్నారు తప్ప కొత్తగా చెప్పిందేమీ లేదు.
బిఆర్ఎస్ 2జి (కేసీఆర్, కేటీఆర్), మజ్లీస్ 3జీ, కాంగ్రెస్ 4జి (నెహ్రూ, ఇందిర, రాజీవ్, రాహుల్ గాంధీ) పార్టీలని కానీ బిజెపి ‘మోడీజీ’ పార్టీ అని అమిత్ షా చెప్పుకొన్నారు. ‘బిఆర్ఎస్ కారు’ భద్రాచలంలో తిరుగుతుంది కానీ మజ్లీస్‌కు భయపడి కేసీఆర్ భద్రాచలం ఆలయంలో అడుగుపెట్టరని అమిత్ షా ఎద్దేవా చేశారు. ఈసారి రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని, బిజెపి ముఖ్యమంత్రి భద్రాచలం సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని అమిత్ షా చెప్పారు.
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధి పనుల గురించి, సంక్షేమ పధకాల గురించి చెప్పుకొని ప్రజలను ఓట్లు అడుగుతుంటే, బిజెపి ప్రధాని నరేంద్రమోడీ పేరు చెప్పుకొంటూ, కేసీఆర్‌ని విమర్శిస్తూ మజ్లీస్ పార్టీతో ముడిపెట్టి విమర్శిస్తూ అధికారంలోకి రావాలనుకొంటోంది. అంటే బిజెపి వ్యూహమే సరిగా లేదని అర్దమవుతోంది.
ఉత్తరాది రాష్ట్రాలలో ప్రయోగిస్తున్న ఈ ఫార్ములా తెలంగాణలో పనిచేయదని రాష్ట్ర బిజెపి నేతలు మొత్తుకొంటున్నా బిజెపి అధిష్టానం ఈ పద్దతిలోనే ముందుకు సాగుతుండటం గమనిస్తే, తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజెపి ఏమీ తహతహలాడిపోవడం లేదని అర్దమవుతోంది. అందుకే బిజెపి,బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందని కాంగ్రెస్ వాదిస్తోంది కూడా. ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ని పదవిలో నుంచి తప్పించేసుకోవడం అదే సూచిస్తోంది.