తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఆదివారం సాయంత్రం ఖమ్మంలో బిజెపి భారీ బహిరంగసభ నిర్వహించబోతోంది. దీనిలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఏపీలో గన్నవరం విమానాశ్రయం చేరుకొంటారు.
అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో భద్రాచలం చేరుకొని సీతారాములను దర్శించుకొంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఖమ్మంలోని సభావేదిక వద్దకు చేరుకొని బహిరంగసభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత రాష్ట్ర బిజెపి కోర్ కమిటీ నేతలతో సమావేశమయ్యి ఎన్నికలకు అభ్యర్ధులు, సన్నాహాల గురించి చర్చిస్తారు. మళ్ళీ హెలికాఫ్టర్ గన్నవరం చేరుకొని ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ బయలుదేరి వెళతారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత విషయంలో ఈడీ హటాత్తుగా వెనక్కు తగ్గడం, అప్పటి నుంచి బిఆర్ఎస్ నేతలు కేంద్రంపై విమర్శలు తగ్గించుకోవడం, ఆ తర్వాత బండి సంజయ్‌ని అకస్మాత్తుగా రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవిలో నుంచి తొలగించడం వంటి వరుస పరిణామాలతో బిజెపి, బిఆర్ఎస్ పార్టీల మద్య రహస్య అవగాహన ఉందనే కాంగ్రెస్ నేతల వాదనలు ప్రజలలో బలంగా నాటుకుపోయాయి. పైగా శాసనసభ ఎన్నికలలో పోటీ చేసేందుకు బిజెపికి అభ్యర్ధులు కూడా లేరనే బిఆర్ఎస్ వాదనలకు కూడా జవాబు చెప్పలేకపోతున్నారు. కనుక ఇప్పుడు మోడీ, అమిత్ షాలే వచ్చి ఎన్నికల ప్రచారం చేసినా తెలంగాణలో బిజెపి గెలిచే అవకాశమే లేదనే టాక్ రాష్ట్రమంతా వినబడుతోంది. బిజెపి విశ్వసనీయతను స్వయంగా దెబ్బ తీసుకొని ఇప్పుడు ఎంత శ్రమించి ఏం ప్రయోజనం?