తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మొహం కూడా చూడటానికి ఇష్టపడని సిఎం కేసీఆర్, ఇవాళ్ళ శ్రావణ శుక్రవారం రోజున ఆమెను సచివాలయానికి ఆహ్వానించారు. మహిళా మంత్రులు, సిఎస్ శాంతికుమారి తదితరులతో ఆమెకు ఎదురేగి సగౌరవంగా ఆమెకు స్వాగతం పలికారు.
అనంతరం ఆమెకు సిఎస్ శాంతికుమారి బొట్టు పెట్టగా సిఎం కేసీఆర్ శాలువా కప్పి ఓ వీణ బొమ్మను బహుమతిగా అందించారు. ఆ తర్వాత సిఎం కేసీఆర్ స్వయంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి సచివాలయం అంతా తిప్పి చూపించి దాని గురించి వివరించారు. గవర్నర్ కూడా కేసీఆర్ మర్యాదలకు చాలా సంతోషంతో పొంగిపోయారు. ఆయన స్వయంగా సచివాలయం అంతా తిప్పి చూపిస్తుంటే ఆమె వివరాలు అడిగి తెలుసుకొన్నారు.
అంతకు ముందు సచివాలయం ఆవరణలో కొత్తగా నిర్మించిన శివాలయం, హనుమాన్ మందిరం, నల్ల పోచమ్మ గుడి వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో ఆమెకు కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత కొత్తగా నిర్మించిన చర్చి, మసీదుల వద్దకు కూడా ఆమెను తోడ్కొని వెళ్ళి చూపించారు.
గత రెండు మూడేళ్ళుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై కత్తులు దూస్తూ, తన మంత్రుల చేత విమర్శలు చేయిస్తూ, ప్రోటోకాల్ పాటించకుండా ఆమెను పదేపదే అవమానించిన కేసీఆర్, హటాత్తుగా ఆమెను ఇంతగా గౌరవించి మర్యాదలు చేయడం చూసి ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు.
అయితే కేసీఆర్ ఏపని చేసిన దానీకో అర్దం, పరమార్ధం ఉంటాయని అందరికీ తెలుసు. కనుక కేసీఆర్‌లో ఈ మార్పుకి కారణం ఏమిటి? అని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు.
మరో మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వంగా మారుతుంది. కనుక అప్పుడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో చాలా అవసరం పడవచ్చని ముందే గ్రహించిన కేసీఆర్ హటాత్తుగా ఆమెకు మర్యాదలు చేయడం మొదలుపెట్టారా?లేక మరేదైనా పెద్ద కారణం ఉందా?అనేది రాబోయే రోజుల్లో మెల్లగా బయటపడుతుంది.