టికెట్‌ కోసం కాదట... గోదావరి జలాల కోసమేనట!

August 25, 2023


img

ఒకవేళ మన రాజకీయ నాయకులకు ఆస్కార్ అవార్డులు ఇవ్వాలనుకొంటే, మొత్తం అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ ఒక్కరినీ పక్కన పెట్టడం సాధ్యం కాదు. ఇందుకు తాజా నిదర్శనంగా ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు గురించి చెప్పుకోవలసి ఉంటుంది. 

కేసీఆర్‌ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా కూడా చేసిన ఆయన 2018 ముందస్తు ఎన్నికలలో ఓడిపోగానే, కేసీఆర్‌ పక్కన పెట్టేయడం సరికాదనే చెపొచ్చు. అయినా ఇంతకాలం చాలా ఓపికగా టికెట్‌ కోసం ఎదురుచూశారు. కానీ కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో తుమ్మల షాక్ అయ్యారు. 

ఈరోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి 1,000 కార్లు, 2,000 బైకులతో భారీ ర్యాలీగా ఖమ్మంలోని నాయకన్ గూడెంకు తరలివెళ్ళారు. అంతకు ముందు తీవ్ర భావోద్వేగంతో కంట తడిపెట్టారు. అంటే ఆయన టికెట్‌ ఆశిస్తున్నారని కానీ అది దక్కనందుకు చాలా బాధపడ్డారని, కనుక ఈవిదంగా కార్లు, బైకులతో ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారని అర్దమవుతూనే ఉంది. 

కానీ నాయకన్ గూడెంలో తన అనుచరులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నాకు ఈ రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తి లేదని కేసీఆర్‌కు ఎప్పుడో చెప్పాను. కానీ మీ అందరి కష్టం చూసిన తర్వాత నేను రాజకీయాలలో కొనసాగాలని, వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిశ్చయించుకొన్నాను. ఇది పదవిపై ఆశతో కాదు. జిల్లాలో మీ అందరి పాదాలను గోదావరి జలాలతో కడిగేందుకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. మీ ఆత్మగౌరవం కోసమే ఎన్నికల బరిలో దిగుతున్నాను. కనుక మీరందరూ నన్ను గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారనే నమ్మకంతోనే పోటీ చేసేందుకు సిద్దపడుతున్నాను,” అని అన్నారు. 

గోదావరి జలాల కోసమే ఎన్నికలలో పోటీ చేస్తున్నారట! కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్న కేసీఆర్‌కు ఖమ్మం జిల్లాకు నీళ్ళు అందించాలని తెలియదనుకోవాలా? తుమ్మలకు తప్ప మరెవరికీ దీనిపై ఆసక్తిలేదనుకోవాలా? అయినా తుమ్మల ఒక్కరూ జిల్లాకు ఏవిదంగా గోదావరి జలాలు తీసుకురాగలరు? ఆ అవకాశమే ఉంటే కాంగ్రెస్‌, బిజెపి, మజ్లీస్ ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాలకి కావలసిన పనులన్నీ చేసుకొని ఉండేవారు కదా?రాజకీయాలపై ఆసక్తి లేదని చెపుతూనే తుమ్మల పదవుల కోసం ప్రాకులాడుతుండటం, పైగా ఈవిదంగా మాట్లాడుతుండటం చాలా విడ్డూరంగా ఉంది. అందుకే ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చెపుతున్నది.          



Related Post