రాజమౌళి దర్శకత్వం వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాకు 69వ జాతీయ అవార్డులలో ఆరు జాతీయ అవార్డులు లభించడం చాలా సంతోషకరం. తెలుగువారందరికీ చాలా గర్వకారణం. అయితే ఇదే సినిమాను భారత్ తరపున ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేసేందుకు పంపించినప్పుడు నామినేషన్స్ కమిటీలో పెద్దలు ఆర్ఆర్ఆర్ సినిమాని పక్కనపడేసి బిజెపి పెద్దలను సంతోషపరిచేందుకు ‘ఛల్లో షో’ అనే గుజరాతీ సినిమాని నామినేట్ చేసి పంపారు. కానీ అది ఆస్కార్ బరిలో నిలబడలేకపోయింది. అది వేరే విషయం.
భారత్ తరపున అధికారికంగా ఆర్ఆర్ఆర్ సినిమాని నామినేట్ చేసి పంపించకపోవడంతో ‘రాజమౌళి టీమ్’ తీవ్ర నిరాశ చెందారు. వారు అక్కడే ఆగిపోయి ఉంటే భారత్ ఓ ఆస్కార్ అవార్డు చేజార్చుకొని ఉండేది. కానీ రాజమౌళి బృందానికి తమ సినిమాపై చాలా నమ్మకముంది. అందుకే ప్రైవేటుగా ఆస్కార్ నామినేషన్స్‌కు దరఖాస్తు చేసుకొన్నారు. అది చాలా మంచి నిర్ణయమని తర్వాత ఆస్కార్ అవార్డ్ లభించినప్పుడు రుజువైంది.
ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైనప్పుడు జాతీయస్థాయిలో సూపర్ హిట్ అయ్యి, మంచి పేరు, కలక్షన్స్ సాధించినప్పుడే కేంద్ర ప్రభుత్వం దానిని గుర్తించి భారత్ తరపున ఆస్కార్ నామినేట్ చేసి పంపించి ఉంటే, నేడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎంతో గౌరవంగా ఉండేది. కానీ అప్పుడు తిరస్కరించి, ప్రపంచంలోనే గొప్ప అవార్డుగా భావింపబడే ఆస్కార్ అవార్డు అందుకొన్న తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్ని జాతీయ అవార్డులు ఇచ్చినా ఆనాడు చేసిన తప్పు లేదా ఆర్ఆర్ఆర్ పట్ల చూసిన చిన్నచూపుని ఎన్నటికీ ఎవరూ మరిచిపోలేరు. జాతీయ అవార్డు ఇచ్చి గౌరవించిన సినిమాకి ఆస్కార్ అవార్డ్ కూడా లభిస్తే గొప్పగా ఉంటుంది కానీ బంగారు కిరీటం పెట్టుకొన్నవాడి నెత్తి న తలపాగా పెడితే గొప్పగా ఉంటుందా?