చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం

August 23, 2023


img

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అయ్యింది. బుదవారం సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు చంద్రుడి దక్షిణధృవంలో ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ చిన్న ఒడిదుకులు కూడా లేకుండా చాలా స్మూత్‌గా దిగింది. 

ఇస్రో నిర్దేశించిన విదంగానే 17 నిమిషాలలో 1. రఫ్ బ్రేకింగ్, 2. అల్టిట్యూడ్ హోల్డ్, 3. ఫైన్ బ్రేకింగ్, 4. టెర్మినల్ డిసెంట్ నాలుగు దశలను అత్యంత ఖచ్చితత్వంతో, భూమిపై నుంచి ఎటువంటి సంకేతాలు పొందకుండానే స్వీయ నియంత్రణ చేసుకొంటూ విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్ చేసింది. ల్యాండింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠ కలిగించినప్పటికీ ప్రతీ దశ చాలా సజావుగా సాగుతూ చంద్రుడి దక్షిణధ్రువంలో ఉపరితలంపై ముందుగా నిర్దేశించిన ప్రదేశంలోనే విక్రమ్ ల్యాండర్ కిందకు దిగింది. చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్ చేసిన అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్‌ కూడా నిలిచింది. ఈ క్రెడిట్ ఖచ్చితంగా మన ఇస్రో శాస్త్రవేత్తలదే. అందుకు వారికి మైతెలంగాణ.కామ్ అభినందనలు తెలియజేస్తోంది. 

విక్రమ్ సాఫ్ట్‌ ల్యాండింగ్ ప్రక్రియను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు చాలా ఆసక్తిగా తిలకించారు. విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా దిగడంతో ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది చప్పట్లు కొడుతూ తమ ఆనందం వ్యక్తం చేశారు. అందరూ సంతోషంతో ఉప్పొంగిపోతూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకొంటున్నారు.  

భారత్‌ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ, వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిద రంగాలకు చెందిన ప్రముఖులు ఇస్రో శాస్త్రవేతలను అభినందిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు. 

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అవ్వాలని కోరుతూ నేడు దేశవ్యాప్తంగా వివిద మతాలవారు ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు చేస్తున్నారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం అవడంతో దేశవ్యాప్తంగా భారతీయులు, పటాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని, జాతీయజెండాలు పట్టుకొని ఉత్సాహంగా సంబురాలు చేసుకొంటున్నారు. దేశ ప్రజలు చంద్రయాన్-3 ప్రయోగంతో ఎంతగానో మమేకం అయ్యారు. ఈ ప్రయోగం విజయవంతం అవ్వాలని మనసారా దేవుళ్ళను ప్రార్ధించారు. వారి కోరికని ఆ భగవంతుడు, ఇస్రో శాస్త్రవేత్తలు తీర్చారు.  

చంద్రుడిపై విక్రమ్ ల్యాండ్ అయినప్పుడు చాలా బారీగా దుమ్ముధూళి పైకి లేస్తుంది. దాని వలన ప్రగ్యాన్ రోవర్‌లో అమర్చిన కెమెరాలు, సున్నితమైన పరికరాలు పాడైపోయే ప్రమాదం ఉంటుంది. కనుక మరో 4 గంటల తర్వాత అంటే ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత ల్యాండర్‌లో నుంచి ఆరు చక్రాలు కలిగిన ‘ప్రగ్యాన్ రోవర్’ మెల్లగా బయటకు వస్తుంది. 

చంద్రుడిపై ఒకరోజు భూమ్మీద 14 రోజులతో సమానం. చంద్రుడి దక్షిణ ధ్రువంలో పగటి పూటే కొద్దిపాటి సూర్యకాంతి ఉంటుంది. రోవర్‌ ఆ సౌర విద్యుత్‌ వినియోగించుకొని పనిచేసేలా డిజైన్ చేశారు. కనుక అది 14 రోజులు మాత్రమే పనిచేస్తుంది. రాత్రిపూట చంద్రుడిపై ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలలో ఉంటుంది. ఒకవేళ ప్రగ్యాన్ రోవర్ దానిని తట్టుకొనగలిగితే మళ్ళీ మర్నాడు, అంటే 14 రోజుల తర్వాత పగలు ఏర్పడినప్పుడు మరోసారి రోవర్ తన పరిశోధనలు కొనసాగించగలుగుతుంది. 


Related Post