వామపక్షాలే మమ్మల్ని మోసం చేశాయి: బిఆర్ఎస్

August 23, 2023


img

సిఎం కేసీఆర్‌ ఏకపక్షంగా 115 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించడంపై సీపీఐ, సీపీఎం పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. కేసీఆర్‌ రాజకీయ ప్రాధాన్యతలు  మారాయని, ఆయన మళ్ళీ బిజెపికి దగ్గరయ్యేందుకే తమను దూరంపెట్టారని వామపక్ష నేతలు ఆరోపించారు.మునుగోడు ఉపఎన్నికలలో తమను వాడుకొని శాసనసభ ఎన్నికలలో మిత్రధర్మం పాటించకుండా వదిలేసి తమని మోసం చేశారని వామపక్ష నేతలు కూనంనేని, తమ్మినేని ఆరోపించారు.

అయితే తాము కేసీఆర్‌ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి రాజకీయాలు చేయడం లేదని, సిద్దాంతాల ఆధారంగానే పనిచేస్తున్నామని అన్నారు. శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీని ఓడించేందుకు సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి పనిచేస్తాయని, తమతో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని ఎన్నికలకు వెళతామని చెప్పారు. 

కానీ వామపక్షాలే మిత్రధర్మం పాటించకుండా తమను మోసం చేశాయని బిఆర్ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఉపఎన్నికలలో తమతో కలిసి పనిచేసినందుకు వామపక్షాలను ఆ తర్వాత కూడా చాలా గౌరవంగా చూసుకొన్నామని, కానీ అవే మిత్రధర్మం పాటించకుండా కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిలో చేరి తమను మోసగించాయని బిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు.

తమతో కలిసి సాగాలనే ఉద్దేశ్యమే వాటికి ఉంటే, ఇండియా కూటమిలో ఎందుకు చేరారని బిఆర్ఎస్‌ నేతలు ప్రశ్నించారు. అవి మిత్రధర్మం పాటించలేదు కనుకనే కేసీఆర్‌ వాటిని పక్కన పెట్టి బిఆర్ఎస్‌ అభ్యర్ధులను ఖరారు చేశారని బిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు.  

ఇంతకీ ఎవరు ఎవరిని మోసం చేసిన్నట్లు? మునుగోడు ఉపఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీని గెలిపించాలంటూ వేదికలెక్కి ప్రసంగించిన వామపక్ష నేతలు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని బిఆర్ఎస్‌ పార్టీని ఓడించాలని ప్రజలను అడుగుతారు?


Related Post