తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకి మంత్రి పదవి లభించింది. అయితే 2018 ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కందాల టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో తుమ్మలను కేసీఆర్ కూడా పక్కన పెట్టేశారు. కానీ టిఆర్ఎస్‌ను బిఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత కేసీఆర్ ఖమ్మంలో తొలిసభ ఏర్పాటు చేసినప్పుడు, మంత్రి హరీష్ రావు తదితరులను తుమ్మల ఇంటికి వెళ్ళి సభకు ఆహ్వానించడంతో ఆయన దానిలో పాల్గొన్నారు.
కనుక ఈసారి తనకు కేసీఆర్ తప్పక టికెట్ ఇస్తారనే తుమ్మల భావించారు. కానీ ఇవ్వకుండా కందాల ఉపేందర్ రెడ్డికి పాలేరు టికెట్ కేటాయించడంతో తుమ్మల నాగేశ్వరరావు షాక్ అయ్యారు. దీంతో ఆయన అనుచరులు మంగళవారం ఖమ్మంలో సమావేశమై తుమ్మల పాలేరు నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలని తీర్మానం చేశారు. నిజానికి తుమ్మల సూచన మేరకే వారు ఆ సమావేశం నిర్వహించారని అర్దమవుతూనే ఉంది.
కనుక తుమ్మల పాలేరు నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమే అని భావించవచ్చు. తన రాజకీయజీవితం అర్దాంతరంగా ముగిసిపోయేలా చేసినందుకు తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ మీద చాలా కోపంగా ఉన్నారు. కనుక ఈసారి పాలేరులో బిఆర్ఎస్‌కు ఆయన గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇంకా బలపడతారు. అప్పుడు అప్పుడు బిఆర్ఎస్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డికి ఇంకా గట్టి పోటీ ఇస్తారు.