స్టేషన్‌ఘన్‌పూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఈసారి టికెట్ నిరాకరించి ఆ సీటును కడియం శ్రీహరికి ఇవ్వడంతో రాజయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యి కన్నీళ్ళు పెట్టుకొంటూ మీడియా ఎదుటే వలవల ఏడ్చేశారు. తాను సిఎం కేసీఆర్‌కు విధేయుడిగా ఉంటూ పార్టీ కోసం ఎంతగానో కష్టపడి పనిచేశానని కానీ తనకు మళ్ళీ టికెట్ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యకర్తలను పట్టుకొని ఆయన, ఆయనను పట్టికొని కార్యకర్తలు ఏడుస్తున్న దృశ్యాలను ఒకవేళ కేసీఆర్ చూస్తే, కడియంను పక్కన పెట్టేసి మళ్ళీ రాజయ్యకే టికెట్ ఇచ్చేసేవారేమో?అంతగా రాజయ్య విలపించారు. తనకు టికెట్ లభించనప్పటికీ స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజల మద్యనే ఉంటానని, కేసీఆర్‌కు, పార్టీకి ఎప్పటికీ విధేయుడిగానే ఉంటానని రాజయ్య చెప్పడం కొసమెరుపు.
అయితే రాజయ్య నోటి దురుసు, ఆయన వ్యవహారశైలి, దళిత బంధులో చేతివాటం ప్రదర్శించడం, సీనియర్ నేత కడియం శ్రీహరితో గొడవలు, ముఖ్యంగా జానకీపురం సర్పంచ్ నవ్యను లైంగిక వేధింపులు వంటివి టికెట్ నిరాకరించడానికి కారణాలని అందరికీ తెలుసు.
సిఎం కేసీఆర్ పదేపదే హెచ్చరిస్తున్నా రాజయ్య తీరు మార్చుకోకుండా అహంభావంతో వ్యవహరించి చివరికి కేసీఆర్ చేత ‘నో’ అనిపించుకొన్నారు.
నిజానికి రాజయ్యకు మొదటే ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా కేసీఆర్ గొప్ప అవకాశమిస్తే, దానిని రాజయ్య దుర్వినియోగం చేసుకొని పదవులు కోల్పోయారు. అదే పదవి చేపట్టిన మంత్రి హరీష్ రావు ఎంతో మంచి పేరు తెచ్చుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు.
అవినీతి ఆరోపణలతో రాజయ్యని కేసీఆర్ మంత్రి పదవిలో నుంచి తొలగించినప్పటికీ, ఆయనకు మరోసారి కూడా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. కానీ దానినీ రాజయ్య దుర్వినియోగం చేసుకొని ఇప్పుడు కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. ఇది రాజయ్య స్వయంకృతమే కనుక కేసీఆర్‌ని లేదా కడియం శ్రీహరిని నిందించడానికి కూడా లేదు.
అయితే ఇప్పటికైనా మేల్కొని కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడం ఒకటే రాజయ్య చేసిన మంచి పని. కేసీఆర్‌కు ఆయన పట్ల సానుభూతి ఉంది కనుక భవిష్యత్‌లో ఏదో ఓ పదవి తప్పక ఇస్తారు. కాకపోతే ఆలోగా మళ్ళీ తోక జాడించకుండా బుద్దిగా మసులుకోవలసి ఉంటుంది.