సిఎం కేసీఆర్ నిన్న ఏకపక్షంగా 115 స్థానాలకు బిఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించేయడంపై సీపీఐ, సీపీఎం పార్టీలు వేర్వేరుగా సమావేశమయ్యాయి. అవి చాలా వేడివేడిగా జరిగిన్నట్లు తెలుస్తోంది.
ఆ రెండు పార్టీల నేతలు తమ రాష్ట్ర కార్యదర్శులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికలలో కేసీఆర్‌కు దూరంగా ఉండాలని చెప్పినా వినకుండా మద్దతు ఇస్తే, శాసనసభ ఎన్నికలలో ఆయన తమను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికలలో ఆ రెండు పార్టీలను వాడుకొని అవసరం తీరాక పట్టించుకోవడం మానేశారనే వాదనలు వినిపించాయి. మీడియా విశ్లేషణలలో కూడా ఇంచుమించు అదే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఇటువంటి వాదనల వలన రెండు పార్టీలకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుంది కనుక సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మేమేమీ కేసీఆర్ చేతిలో మోసపోలేదు. మునుగోడులో పరిస్థితులను బట్టి అప్పుడు మేము ఆయనకు మద్దతు ఇచ్చాము. అంతే!
ఇప్పుడు ఆయన దారి ఆయన చూసుకొన్నారు. మా దారి మేము చూసుకొంటాము. అయినా వామపక్షాలు సిద్దాంతాల ఆధారంగానే పనిచేస్తాయి తప్ప ఎవరి మీదో ఆధారపడి మనుగడ సాగించవు. రాబోయే ఎన్నికలలో సీపీఐ, సీపీఎం రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయి. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసుకొంటున్నాము. కనుక బిఆర్ఎస్‌తో పొత్తు గురించి ఆలోచించవలసిన అవసరం మాకు లేదు,” అని అన్నారు.